బీజేపీ ఎంపీని అరెస్టు చేయాల్సిందే

– కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన
– బ్రిజ్‌భూషణ్‌ అరెస్టుకు రేపటితో ముగియనున్న అల్టిమేటం
– ఆందోళనకు సచిన్‌ పైలట్‌, మహిళా సంఘాల సంఘీభావం
న్యూఢిల్లీ : క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు, రైతులు పోలీసులకు ఇచ్చిన అల్టిమేటం ఆదివారంతో ముగియనుంది. బ్రిజ్‌భూషణ్‌ను రహస్యంగా విచారించినట్టు చెబుతున్నప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోలేదు. కాగా, ఈ నెల 21న జంతర్‌మంతర్‌లో జరిగే రైతు సంఘాల సమావేశంలో భవిష్యత్‌ ఆందోళనను ప్రకటించనున్నారు. అయితే ఈ సమావేశానికి రైతులను రానివ్వకుండా పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకోవాలని చూస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో పికెట్లు కూడా ఏర్పాటుచేశారు. ట్రాక్టర్లు జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకుంటాయన్న సమాచారంతో భారీ స్థాయిలో బారికేడ్లూ ఏర్పాటుచేశారు. రెజ్లర్ల పతకాలు వేలం వేస్తే కేవలం రూ.15 వేలు మాత్రమే లభిస్తాయన్న బ్రిజ్‌భూషణ్‌ ఆరోపణపై సాక్షి మాలిక్‌ స్పందించారు. బీజేపీ ఎంపీ తమ 15 ఏండ్ల కష్టాన్ని ఎగతాళి చేశారని, దేశానికి సాధించిన పతకాలు ఎవరి దాతృత్వం కాదని ఆమె అన్నారు. జంతర్‌ మంతర్‌లోనే రెజ్లర్ల ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. దీంతో రెజ్లర్ల ఆందోళన 27 రోజులు పూర్తిచేసుకుంది. వామపక్ష మహిళా సంఘాలు నాయకులు నిరసన వేదిక వద్దకు చేరుకుని మల్లయోధులకు మద్దతు ప్రకటించాయి.
వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : సచిన్‌ పైలట్‌
కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ నిరసన ప్రదేశాన్ని సందర్శించారు. కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ నిరసన తెలిపిన మల్లయోధుల ‘న్యాయబద్ధమైన డిమాండ్‌’ను వీలైనంత త్వరగా పరిష్కరించాలనీ. చట్టం పరిధిలో ”నిష్పాక్షిక” విచారణ జరగాలని అన్నారు. ‘గత 26-27 రోజులుగా మన అగ్రశ్రేణి క్రీడాకారులు చాలా బాధలో ఉన్నారు. తమపై జరిగిన అకృత్యాలకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారు ఇన్ని రోజులుగా వేడుకుంటున్నారు. తమకు తగిన గౌరవం లభించేలా వేచి ఉన్నారు. వారికి న్యాయం చేయాలని కోరుతున్నా’ అని పైలట్‌ అన్నారు. దేశంలోని యువ తరం, రైతులు, మల్లయోధులు సంతోషంగా లేనప్పుడు దేశం సంతోషంగా ఉండదన్నారు. అథ్లెట్లు దేశానికి పతకాలు తెస్తే యావత్‌ దేశం ఆనందిస్తోందని, అదే ప్రజలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో భారీ భద్రత
నిరసన చేస్తున్న మల్లయోధులకు మద్దతుగా ఆదివారం రైతుల సమావేశం దృష్ట్యా ఢిల్లీ పోలీసులు జంతర్‌ మంతర్‌ వద్ద, దేశ రాజధాని సరిహద్దుల్లోని భారీ భద్రతా ఏర్పాట్లుచేసినట్టు ఒక అధికారి తెలిపారు. ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేయడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో పికెట్లను పెంచుతున్నట్టు తెలిపారు. 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆ ప్రాంతమంతా సీసీటీవీ కెమెరాలతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.