భావోద్వేగాలతో బీజేపీ రాజకీయం

BJP politics with emotions– సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు
– పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తేవాలి : సీపీఐ(ఎం) నిరసనలో జూలకంటి, పోతినేని
నవతెలంగాణ-మిర్యాలగూడ/విలేకరులు
”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయాల తప్ప ప్రజా సమస్యల పట్టింపులేదు.. వాటిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సున్నిత అంశాల ఆధారంగా భావోద్వేగాలను రెచ్చగొడుతోంది..” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన అన్నారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం పలు జిల్లాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) ఆఫీస్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. ప్రజలు పెరిగిన ధరలతో అల్లాడుతుంటే.. వాటిని తగ్గించకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు దేశం పేరు మార్పు తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజలు దేశం పేరు మార్చాలని ఎక్కడైనా అడిగారా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆ పథకాలన్నీ సొంత పార్టీ కార్యకర్తలకే అందజేస్తున్నారని ఆరోపించారు. పేదల కోసం పథకాలు తెస్తున్నామని చెబుతున్న కేసీఆర్‌ సొంత పార్టీ కార్యకర్తలకు కొందరికే ఇచ్చి నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పథకాలు అందే తీరుపై ప్రజలకు వివరించి చైతన్య పరచాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని, ఉపాధి అవకాశాలు కల్పించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సున్నిత అంశాల ఆధారంగా భావోద్వేగాలు రెచ్చగొడుతోందన్నారు. దేశంలో రోజు రోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై విపరీతమైన భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఖమ్మంనగరం, ముదిగొండ, ఖమ్మంరూరల్‌, బోనకల్‌, వైరా, పెనుబల్లి, నేలకొండపల్లి మండలాల్లో నిరసనలు తెలిపారు. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. నిత్యావసర సరుకులపై పన్నులు తగ్గించాలని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని నేతలు డిమాండ్‌ చేశారు.