– ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మహిళల హక్కుల హరణ
– ఎన్ని చట్టాలొచ్చినా ఇంకా వివక్ష
– హక్కుల కోసం మహిళలు ఐక్యంగా పోరాడాలి: ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారతీయ జనతాపార్టీ మనుధర్మ శాస్త్రాన్ని ప్రోత్సహిస్తూ, రాజ్యాంగం మహిళలలకు కల్పించిన హక్కులను కాలరాస్తోందని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షులు ఎస్. పుణ్యవతి విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ”మహిళపై మనుస్మృతి ఇంకా రాజ్యం ఏలుతుందా” అనే అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం జరిగిన వెబినార్‌లో ఆమె ప్రసంగించారు. భారతీయ సమాజంలోని అగ్రవర్ణాలు వేల ఏండ్లుగా ఈ గ్రంథాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను అణగదొక్కారని ఆందోళన వ్యక్తం చేశారు. 1908లో జరిగిన మెక్సికో పోరాటం, 1857 ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మహిళా కార్మికుల నిరసనలు మహిళాదినోత్సవానికి నాంది పలికాయని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాలు, స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర నేపథ్యంలో వారికి అనేక హక్కులు కల్పించినప్పటికి ఆచరణలో పూర్తిగా అమలు జరగడం లేదన్నారు. మను ధర్మ శాస్త్రాన్ని ప్రజల నరనరాల్లో ఎక్కించి వివక్షకు బీజేపీ మరింత ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులపై అప్రకటిత నిషేదం విధించారని విమర్శించారు. ఆహారంలో, ఆహార్యంలో అన్నింటా ఇలా మనుధర్మం నిర్దేశించిన ఆటవిక న్యాయాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వందల ఏండ్ల క్రితం ఈ దురాచారాలకు వ్యతిరేకంగా ఆత్మబలిదానం చేసిన ప్రీతిలతా లాంటి వారిని చరిత్ర ఎందుకు మరిచిందని ప్రశ్నించారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సంస్కరణలు వచ్చినా పురుషాధిక్య భావజాలం మూలంగా అవి ఆచరణలో విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. స్త్రీలు సంపాదిస్తున్న మొత్తంపై కూడా వారికి ఇంకా పూర్తి స్వేచ్ఛ రాలేదన్నారు. మహిళల హక్కులను కాలరాసేందుకు వర్ణ వ్యవస్థ ముసుగులో ఆధిపత్య కులాలు సృష్టించిందే మనుధర్మ శాస్త్రమని విమర్శలు గుప్పించారు. ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని గురజాడ అప్పారావు మాటలను అక్షర సత్యాలు చేస్తూ మహిళలు సమానత్వం, సాధికారిత కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ వెబినార్‌కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.