బీజేపీని గద్దె దించాలి

– కార్యాచరణలో వేగం పెంచాలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీని గద్దె దించే కార్యాచరణలో వేగం పెంచాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఈ సమావేశం జరగటం ఇది మూడోసారి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చ జరిగింది. బీజేపీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై వ్యూహాలు ప్రతి వ్యూహాలపై చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు, బీజేపీని గద్దె దించడానికి ఇండియా కూటమితో కలిసి పనిచేయడం, దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, రాహుల్‌ గాంధీ రెండో విడత భారత్‌ జోడో యాత్ర జనవరిలో తూర్పు నుంచి పడమర వరకు చేపట్టాలనే ప్రతిపాదనపై కూడా చర్చించినట్టు తెలుస్తున్నది. ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్‌ వరకు చేసే జోడో యాత్ర చాలా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాల అంశంపైనా సీడబ్ల్యూసీలో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో మెగా ర్యాలీ జరుపుకోవడానికి ముందు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఉన్న విషయం తెలిసిందే.