బీజేపీ మతోన్మాద విధానాలను ఎదిరించాలి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌
కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను కార్మిక వర్గం ఐక్యతతో ఎదిరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి కోరారు. మతోన్మాదం కార్మిక వర్గం ఐక్యత అనే అంశంపై సిద్దిపేటలో గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత విభజన సమీకరణ వెనకాల ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందని విమర్శించారు. దేశంలో కార్పొరేట్‌ శక్తుల లాభాలకు ఎదురులేకుండా చేయాలని కార్మిక ఐక్యతను బిజెపి దెబ్బతీయాలను చూస్తుందని అన్నారు. భారతదేశం ఆర్థికంగా నిలబడడానికి వెన్నుముకగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అతి తక్కువ రేట్లకే అప్పనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతుందన్నారు. రైల్వేలు కోర్టులు బొగ్గు బావులు టెలికం విద్యుత్‌ సంస్థలు నేషనల్‌ హైవేలో పెట్రోలియం కంపెనీలు విమానయానం స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ గోదాములు ప్రభుత్వ భూములు లాంటి అనేక రంగాలను పెట్టుబడుదారులకు తాకట్టు పెడుతున్నారని అన్నారు. విద్యార్థుల మనసులో విష బీజాలు నాటే విధంగా పాఠ్యపుస్తకాల్లో అశాస్త్రీయతను చెప్పిస్తూ కాషాయీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బిజెపి చేసే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కళావతి, జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్‌, నాయకులు కిష్టయ్య, కనకయ్య, రాజు, కిరణ్‌, శంకర్‌, బాల నరసయ్య, రఘుపతిరెడ్డి, భూపతిరెడ్డి, శ్రీనివాస్‌, చంద్రకళ, లావణ్య పాల్గొన్నారు.