బీజేపీ, బీఆర్‌ఎస్‌లను గద్దె దించాలి

BJP should oust BRS– అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పని చేయాలి : ఆకునూరి మురళి
– టీజేఎస్‌కు పలు అంశాలపై నోట్‌ అందజేత
– మ్యానిఫెస్టోలో చేర్చాలని వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను గద్దె దించాలని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం (ఎస్డీఎఫ్‌) వ్యవస్థాపక కన్వీనర్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆకునూరి మురళీ కోరారు. ఆయా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో చేర్చేందుకు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన, అవినీతిని తగ్గించడం, బీసీ కులగణన అంశాలపై వాటికి నోట్స్‌ను ఎస్డీఎఫ్‌ అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్‌, బీయస్పీ పార్టీలకు వాటిని అందజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) కార్యాలయానికి వచ్చిన ఆయన ఆ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాంకు నోట్స్‌ ను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ మినహా అన్ని పార్టీలకు ఆ నోట్స్‌ ను అందజేయనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ విద్యను విధ్వంసం చేశారనీ, విద్యా నాణ్యతలో దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తెలంగాణది 35వ స్థానమని విమర్శించారు. విద్యకు చాలా రాష్ట్రాలు 14 నుంచి 15 శాతం బడ్జెట్‌ ఇస్తుంటే బీఆర్‌ఎస్‌ కేవలం 4.6 శాతం మాత్రమే కేటాయించిందని విమర్శించారు. వైద్యరంగ బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని కోరారు. రైతులు కానీ వారికి రైతుబంధు పేరుతో రూ.28 వేల కోట్లను అందజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిధులను ధరల స్థిరీకరణకు కేటాయించి, రాజ్యాంగ బద్ధ వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలకు కనీస మద్ధతు ధర ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. నైపుణ్యత కొరవడిన కారణంగా ఉద్యోగాలను పొందడంలో రాష్ట్ర యువత వెనుకబడిందని చెప్పారు. రాష్ట్రంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందనీ, ఇక్కడి అవినీతి సొమ్ముతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని విమర్శించారు. సీఎం, గవర్నర్‌ మినహా అందరిని విచారించేలా కమిషన్‌ ఏర్పాటు చేయాలనీ, అందుకోసం చట్టం చేయాలని సూచించారు. బీసీ కులగణన చేపట్టాలనీ, తద్వారా శాస్త్రీయంగా ఆయా వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు.
మురళీ బృందానికి కృతజ్ఞతలు : కోదండరాం
మురళీ బృందానికి ప్రొఫెసర్‌ కోదండరాం కృతజ్ఞతలు తెలిపారు. వారు లెక్కలతో సహా నోట్స్‌ తయారు చేశారని తెలిపారు. వాటిని స్థూలంగా ఆమోదిస్తున్నట్టు తెలిపారు. అవన్నీ సాధ్యమే అని చెప్పేలా ఉందన్నారు. భవిష్యత్తులోనూ వాటి కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎస్డీఎఫ్‌ నుంచి డాక్టర్‌ పద్మజా షా, డాక్టర్‌ లక్ష్మినారాయణ, టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్‌ కోదండరాంతో ఆకునూరి మురళీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.