అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్‌

BJP steering in the hands of Adani– ఐటీ సెక్టార్‌గా మారనున్న మలక్‌పేట్‌
– బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ ఐటీ ఉద్యోగాలు : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
– మలక్‌పేటలో ఐటీ పార్కుకు శంకుస్థాపన
నవతెలంగాణ-సంతోష్‌నగర్‌
”బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ ఎప్పుడూ కేసీఆర్‌ చేతుల్లోనే ఉంటుంది.. ఎంఐఎం స్టీరింగ్‌ అసదుద్దీన్‌ చేతుల్లోనే ఉంటుంది.. బీజేపీ స్టీరింగ్‌ మాత్రం అదానీ చేతుల్లో ఉంది” అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఐటీ పార్కుకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ టవర్‌ ఏర్పాటుతో మలక్‌పేట్‌ రూపు రేఖలు మారబోతు న్నాయని, ఐటీ సెక్టార్‌గా మారబోతోందని హైదరాబాద్‌ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. చిన్నప్పుడు మలక్‌పేట్‌ అంటే టీవీ టవర్‌ అనే వాళ్లని, రాబోయే రోజుల్లో మలక్‌పేట అంటే ఐటీ టవర్‌ అంటారన్నారు. 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్థులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. 36 నెలల్లోనే ఐటీ టవర్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ వంటి పెద్ద కంపెనీలను తీసుకొస్తామని తెలిపారు. రెండేండ్లుగా బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఐటీ ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. మూసీ ఆధునికీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఓల్డ్‌ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల మాట్లాడుతూ.. ఐటీ టవర్‌ ఏర్పాటుతో హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, కార్పొరేటర్లు ఎండీ సైఫదిన్‌ షఫీ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఇమ్రాన్‌, మహమ్మద్‌ అలీ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనిత నాయక్‌, మలక్‌పేట్‌ జాగృతి అధ్యక్షులు తిరునగరి రాధ తరులు పాల్గొన్నారు.