కర్నాటకలో బీజేపీ టిక్కెట్ల కుంభకోణం!

ఆమె మూడు పదులు నిండకుండానే అన్ని విధాలుగా పేరు మోసిన కట్టర్‌ హిందూత్వవాది. అతడు తన మఠం, కాషాయ దుస్తులతో మోసానికి పాల్పడిన మరో కట్టర్‌. వీరితో చేతులు కలిపిన మరో నలుగురితో కలసి వారు ఇప్పుడు బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఉద్రేక, ఉన్మాద ఉపన్యాసాలు చేసి రెచ్చగొట్టటంలో పేరు మోసిన హిందూత్వ నేతగా పేరున్న చైత్ర కుందాపుర, శ్రీ హలస్వామి మహాసంస్థాన్‌ మఠ అధిపతి అభినవ హలస్వామి, వారితో చేతులు కలిపిన బీజేపీ యువ మోర్చా నేతలు, ఇతరులు ఈ ‘టికెట్‌ కేసు’లో ఉన్నారు. అధికారంలో ఉన్న పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను ఉపయో గించి నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు కొట్టేసేవారి గురించి బయటకు తెలిసేది తక్కువ. ఎందుకంటే చెప్పుకుంటే పరువు పోతుందని అనేక మంది తేలుకుట్టిన దొంగల మాదిరి కిమ్మనరు. కర్నాటకలో ఇప్పుడు బీజేపీ టిక్కెట్ల కుంభకోణం వెల్లడి కావటంతో ఆ పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది. తమకేమీ సంబంధం లేదని పార్టీ నేతలు చెబుతుండగా, అగ్ర నేతల ప్రమేయం ఉందని కేసుల్లో అరెస్టయిన వారు అంటున్నారు.
ఉడిపి జిల్లాలోని బైందూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనకు బీజేపీ టిక్కెట్‌ ఇస్తామంటూ డబ్బు తీసుకొని మోసం చేశారని గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని, కేంద్ర హౌంమంత్రి కార్యాలయం, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో తమకు ఉన్న సంబంధాల గురించి చెప్పి డబ్బు వసూలు చేశారన్నది వారి మీద మోపిన నేరం. తనకు ఒకరిని పరిచయం చేసి అతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అని చెప్పారని, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి నిధులు అవసరమంటూ చెప్పటంతో అతగాడికి రూ.మూడు కోట్లు, మరో రూ. రెండు కోట్లు చైత్ర అనుచరులకు చెల్లించినట్లు పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి వారంతా తప్పించుకుంటున్నారని తెలిపాడు. అనేక రాష్ట్రాలలో ఇలాంటి మోసగాళ్లు ఎందరో ఉన్నారు. కర్నాటకలో 2020లో బెంగళూరు పోలీసులు స్వామి అలియాస్‌ సేవాలాల్‌ అనే జ్యోతిష్కుడు యువరాజ్‌ రామదాస్‌ను అరెస్టు చేశారు. అతగాడు 2014 నుంచి 2020 వరకు అనేక మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఒక గవర్నర్‌, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పేవాడు. 2015లో జౌళిశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సంతోష్‌ గాంగవార్‌కు శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనంద కుమార్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. కేంద్ర సిల్క్‌బోర్డు చైర్మన్‌ పదవి ఇప్పిస్తానంటూ ఒకటిన్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ స్వామికి ఒక ప్రముఖ బీజేపీ నేత తనను పరిచయం చేసినట్లు, తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత పదవీ లేదు, స్వామి ముఖం చాటేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆనందకుమార్‌ పేర్కొన్నారు. సదరు స్వామి ఒక ఎంపీని తిరిగి నామినేట్‌ చేయిస్తానని రూ.ఇరవై కోట్లు, కర్నాటక హైకోర్టు మాజీ మహిళా జడ్జికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానంటూ రూ.ఎనిమిదిన్నర కోట్లు కోట్లు వసూలు చేశాడు. బిఎస్‌ ఇంద్రకళ అనే ఆ మాజీ జడ్జి నగదు రూపంలో నాలుగున్నర కోట్లు, ఆర్‌టిజిఎస్‌ ద్వారా రూ.3.77 కోట్లు చెల్లించారు. ఆమెను ఢిల్లీ తీసుకువెళ్లి కొంత మంది బీజేపీ అగ్రనేతలను పరిచయం చేశారట. ఆమె 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తులుగా ఎలాంటి వారు ఎంపిక అవుతున్నారు, గవర్నర్‌ పదవులను కొనుక్కోవటం ఎంత సులభంగా ఉంటుందో డబ్బు, పలుకుబడి కలవారి ప్రయత్నాల గురించి ఈ ఉదంతం వెల్లడించింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో ఉన్న పలుకుబడితో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించమని ఒక డాక్టర్‌ రూ.30లక్షలు సమర్పించుకున్నారట. 2019లో స్వామి తనను రూ.పది కోట్లకు మోసం చేసినట్లు శశికాంత్‌ బంద్రే అనే వాణిజ్యవేత్త ఫిర్యాదు చేసిన తరువాత పైన పేర్కొన్న మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
ఇక హిందూత్వ నాయకురాలు చైత్ర కుందాపూర్‌, ఆమె గ్యాంగ్‌ మోసం చేసిన తీరు గురించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మోసగాళ్ల ముఠాలో స్వామీజీతో పాటు కబాబ్‌లు తయారు చేసి అమ్ముకొనే వ్యక్తి, ఒక క్షురకుడు ఉన్నారు. తమ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, ప్రధాని కార్యాలయంలో తనకు పెద్ద తలకాయలు ఎందరో తెలుసని చైత్ర ప్రచారం చేసుకుంది. 2022లో వ్యాపారవేత్త పూజారికి ప్రసాద్‌ బైదూర్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి అతను బీజేపీ కార్యకర్త అని చెప్పారు. చైత్ర తలచుకుంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైనా సాధించగలదని అతను పూజారిని నమ్మించాడు. అది బాగా పని చేసిందని గ్రహించిన తరువాత ఆ ముఠా గగన్‌ కదూర్‌, రమేష్‌ నాయక్‌ అనే వారిని పరిచయం చేశారు. రమేష్‌ తన పేరును దాచి తాను చిక్‌మగళూరుకు చెందిన విశ్వనాధ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతనని గత 45ఏళ్లుగా పనిచేస్తున్నట్లు నమ్మించాడు. తరువాత బెంగళూరులోని ధనికులు నివాసముండే ప్రాంతంలో చెన్నా నాయక్‌ అనే అతన్ని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడని పరిచయం చేశారు. ఒక పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు పొందిన 110సంవత్సరాల తిమ్మక్క కుమారుడు ఉమేష్‌తో గగన్‌ కదూర్‌కు పరిచయం ఉంది. ఆమెకు వయసు పైబడటంతో కాబినెట్‌ స్థాయి కల్పించి ఒక కారు కూడా ఇచ్చారు. ఉమేష్‌ను ఒప్పించి ఆ కారులో చెన్నా నాయక్‌, ఇతర ముఠా పూజారిని కలిశారు. అధికారిక కారును చూసి నిజంగానే పలుకు బడి కలిగిన వారని పూజారి నమ్మాడు. టిక్కెట్‌ కనుక రాకపోతే ఇచ్చిన సొమ్ము పూర్తిగా తిరిగి ఇస్తామని రమేష్‌ నాయక్‌ నమ్మబలికాడు. మూడు రోజుల్లో రూ.50లక్షలు, తరువాత రూ.మూడు కోట్ల మేర వసూలు చేశారు. ఆ సొమ్ములో ఒకటిన్నర కోట్లు అభినవ హలశ్రీ స్వామి అనే మఠాధిపతికి చెల్లించినట్లు పూజారి పేర్కొన్నాడు. 2022 జులై ఏడు నుంచి 2023 జనవరి 16 వరకు మొత్తం ఐదు కోట్లు సమర్పించుకున్నాడు.
బీజేపీ అభ్యర్థులను ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు కాశ్మీరులోని ఒక ఆసుపత్రిలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత విశ్వనాధ్‌ మరణించినట్లు గగన్‌కదూర్‌ చెప్పాడు. అనుమానం వచ్చిన పూజారి విచారించగా అసలు ఆ పేరుగల వ్యక్తిలేడని తేలింది. దాంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో మోసగాళ్ల ముఠా తప్పించుకు తిరిగింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేశారు. సెప్టెంబరు పన్నెండు నుంచి హలశ్రీ స్వామి పరారీలో ఉండి పందొమ్మిదవ తేదీ రాత్రి ఒడిషా పోలీసులకు చిక్కాడు. ఇంతకీ రమేష్‌ నాయక్‌ చిక్‌మగలూర్‌లోని ఒక క్షురకుడు అని తేలింది. చెన్నానాయక్‌ బెంగళూర్‌ కెఆర్‌పురంలో వీధుల్లో కబాబ్‌లు అమ్ముతాడని పోలీసులు గుర్తించారు. పూజారి నుంచి కొట్టేసిన సొమ్ములో భారీ మొత్తాన్ని చైత్ర నొక్కేసింది. విద్యార్థినిగా ఉండగా ఏబీవీపీలో పని చేసిన చైత్ర కొన్ని పత్రికల్లో జర్నలిస్టుగా, స్పందన అనే టీవీలో యాం కర్‌గా పని చేసింది. హిందూత్వ కార్యకర్తగా మైనారి టీల మీద రెచ్చగొట్టే ప్రసంగాలతో అనేక పాత్రల్లో కనిపించిన చైత్ర 2018లో ఉడిపి పట్టణంలో కాంగ్రెస్‌ మీద ధ్వజమెత్తి వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రులు కూడా ఆమెను ఆకాశాకెత్తారు. ముస్లింల మీద విద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకు ఆమెపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ ఉపన్యాసాలకు బజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, సభలు, సమావేశాలే వేదికలు.
అవివాహిత అయిన చైత్ర కుందాపుర మీద ఉడిపిలో బీజేపీ కార్యకర్త సుధీన్‌ ఒక కేసు దాఖలు చేశాడు. తన కోసం ఒక దుకాణాన్ని కట్టిస్తానని చెప్పి ఆమె రూ.ఐదు లక్షలు తీసుకున్నదని, అది చేయకపోగా సొమ్ము వాపసు అడిగితే అత్యాచారం చేసినట్లు కేసు పెడతానని, హత్య చేయిస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు. బీజేపీ టిక్కెట్‌ పేరుతో సొమ్ము తీసుకున్న వ్యాపారి పూజారిని కూడా బెదిరించినట్లు వెల్లడైంది. అరెస్టుకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఒక లేఖ రాసి అతని వాణిజ్య లావాదేవీల మీద విచారణ జరపాలని, దర్యాప్తుకు తాను సహకరిస్తానని పేర్కొన్నది. తాను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి గోవిందబాబు పూజారి తెలుసునని, బీజేపీ టిక్కెట్‌ కోసం చూశాడని, తాను ఒక ప్రయివేటు కంపెనీలో పని చేసినపుడు అతని అక్రమ లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు రాసింది. అతని అక్రమాలను బయట పెట్టేందుకు అతనితో సంబంధాల్లో ఉండి సమాచారం సేకరించినట్లు చెప్పుకుంది. చిత్రం ఏమిటంటే సదరు పూజారికి ఎంఎల్‌ఏ టిక్కెట్‌ రాకున్నా, ఎన్నికలకు ముందు బీజేపీ వెనుకబడిన తరగతుల మోర్చా కార్యదర్శి పదవిని బహూకరించారు. ఏ నియోజకవర్గంలో టిక్కెట్‌ను ఆశించాడో అదే చోట బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేశాడు. అనేక మంది నేతలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక గుర్తింపు పొందాడు. అధికారం వచ్చిన తరువాత ఆ సొమ్మును ఏదో విధంగా రాబట్టుకోవచ్చని భావించి ఉండాలి. బీజేపీ ఓడిపోవటం, పార్టీ పదవి ఉన్నా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత తన సొమ్ము తనకు ఇచ్చివేయాలని డిమాండ్‌ చేయటంతో అసలు కథ బట్టబయలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
– సత్య