బీజేపీకి 200 సీట్లు దాటవు

BJP won't cross 200 seats– కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే..!
– మోడీ గోదావరిని ఎత్తుకెళ్తాడట..!
– ఎన్టీఆర్‌ వచ్చాకే సంక్షేమం మొదలు..
– బీఆర్‌ఎస్‌ హయాంలో అంతకు మించి సంక్షేమం : ఖమ్మం రోడ్‌షోలో మాజీ సీఎం కేసీఆర్‌
– 12 సీట్లతో కీలకంగా బీఆర్‌ఎస్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదని దేశం మొత్తం కోడై కూస్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దానిలో 12 ఎంపీ సీట్లతో బీఆర్‌ఎస్‌ కీలకంగా మారుతుందన్నారు. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అవుతారని తెలిపారు. మోడీ దాడి నుంచి.. చేతగాని, చేవలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు, మాళోత్‌ కవిత విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షో.. ఖమ్మం కాల్వడ్డు నుంచి మయూరి సెంటర్‌, వైరా రోడ్డు మీదుగా కొనసాగింది. అనంతరం జడ్పీ సెంటర్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. నరేంద్ర మోడీ గోదావరిపైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి తమిళనాడు, కర్నాటకకు నీళ్లు తీసుకెళ్తానంటుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు గానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గానీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. మోడీ దాడి నుంచి.. చేతగాని చేవలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని 37 టీఎంసీల సామర్థ్యంతో సీతారామ ప్రాజెక్టు చేపట్టామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ఇదే చెప్పినా.. మన వాటా నీళ్లు తేలేదాక.. నా తల తెగిపడినా ఒప్పుకోనని చెప్పా అని తెలిపారు. వీళ్లకు ఓట్లు, సీట్లు, మంత్రి పదవులు కావాలి తప్ప మన నీళ్లు, పంటలు, రైతులు పట్టరని దుయ్యబట్టారు. మన నిధులు, హక్కులు సాధించుకోవాలంటే.. బీఆర్‌ఎస్  అయితేనే పేగులు తెగే దాక కోట్లాడతదని అన్నారు.
ఎన్టీఆర్‌ వచ్చాకే సంక్షేమం..
రాష్ట్రంలో సంక్షేమం అమల్లోకి వచ్చింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకనే అని కేసీఆర్‌ అన్నారు. పేదలకు బుక్కెడంత బువ్వ దొరికి రూ.2కు కిలో బియ్యం పథకం, భూమిశిస్తు రద్దు, నిజమైన సంక్షేమం అప్పుడే ప్రారంభమైందని తెలిపారు. ఎన్టీఆర్‌కు మించి కార్యక్రమాలు బీఆర్‌ఎస్‌ హయాంలో చేసుకున్నామన్నారు. గుంట భూమున్న రైతు చనిపోయినా వారం రోజుల్లో రైతుబీమా ఇంటికి పంపించామని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని రైతుబంధు గురించి అడిగితే చెప్పు తెగ్గుద్దంటున్న మంత్రికి.. రైతుల చెప్పులు నీకంటే గట్టిగా ఉంటాయని చెప్పానన్నారు. తొమ్మిదేండ్లు రెప్పపాటు పోకుండా ఉన్న కరెంట్‌ ఇప్పుడు ఎక్కడికి పోయిందన్నారు. ఉస్మానియా యూనివర్శిటీకే నీళ్లు ఇచ్చే దిక్కు లేదని తాను భట్టి విక్రమార్కకు ట్వీట్‌ చేశానన్నారు. చీఫ్‌ వార్డెన్‌కు సస్పెన్షన్‌ లెటర్‌ ఇస్తే.. కరెంట్‌ కోతలు నిజం కాకుండా పోతాయా అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌ పాలనలో వరి కోతలు.. ఇప్పుడు కరెంట్‌ కోతలు..
బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కడ చూసినా వరి కోతలుంటే.. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్‌ కోతలున్నాయన్నారు. సాగర్‌లో నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నాయన్నారు. పాలేరు, భక్తరామదాసు ప్రాజెక్టును కూడా ఎండగట్టారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై ముఖ్యమంత్రి ఎన్ని ఒట్లు పెట్టుకుంటాడని ప్రశ్నించారు.
ఆగస్టు 15లోపు రుణమాఫీపై హరీశ్‌రావు రాజీనామా పత్రం ఇస్తే.. ముఖ్యమంత్రి తోక ముడిచాడని విమర్శించారు. బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.2,500 సంగతేంటని అడిగారు. బురిడీ కొట్టించే హామీలపై ప్రశ్నిస్తే నేను జానారెడ్డిని కాదు.. కేసీఆర్‌ గుడ్లు పీకి గోళీలు ఆడుతా.. పండబెట్టి తొక్కుతా.. చర్లపల్లి జైళ్లో వేస్తా.. ఇదీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ భయంకరమైన రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు. బీజేపీ రేవంత్‌రెడ్డిని తమ పార్టీలోకి జంప్‌ చేస్తాడన్నా ఒక్కమాట కూడా ఆయన ఖండించడం లేదన్నారు.
కనీసం పదెకరాలకైనా రైతుబంధు ఇవ్వాలి..
ఐదు ఎకరాలకు మించి రైతుబంధు ఇవ్వమనటం కాంగ్రెస్‌కు తగదని కేసీఆర్‌ అన్నారు. 20, 25 ఎకరాలకు ఇవ్వమంటే అర్థముంటది కానీ పదెకరాలకు కూడా ఎగబెడతమంటే కుదరదన్నారు. ఖమ్మంలో మూడురోజులకోసారి తాగునీళ్లు వస్తున్నాయన్నారు. ఖమ్మం, కొత్తగూడెంకు మెడికల్‌ కాలేజీ, కేంద్ర ప్రభుత్వం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉండగా కొత్తగూడెంకు ఇచ్చిందా అని ప్రశ్నించారు. వివాదరహితుడైన నామ నాగేశ్వరరావుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ రోడ్‌షోలో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు, మాళోత్‌ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, మాజీ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, బాణోత్‌ మదన్‌లాల్‌ తదితరులు పాల్గన్నారు.