దక్షిణాదిలో బీజేపీకి ఒక్క సీటూ రాదు

– డీలిమిటేషన్‌తో ఆయా రాష్ట్రాలకు అన్యాయం
– దీనిపై కమలం పార్టీ వైఖరేంటో చెప్పాలి
– కులగణన చేయకపోవడంలో కాంగ్రెస్‌, బీజేపీలది సమాన బాధ్యత : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ- చెన్నై
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయనీ, దీనిపై బీజేపీ వైఖరి ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోడానికి సిద్ధంగా లేవన్నారు. దశాబ్దాల కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో అన్ని రంగాల్లోనూ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఇండియా కూటమి ప్రజల కోసం ఏమి చేస్తుందనే ఎజెండాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం చెన్నైలో ఏబీపీ నెట్వర్క్‌ సంస్థ నిర్వహించిన సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌లో ”సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ?” అన్న అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. దీనికి ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. అందులో కవితతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.అన్నమలై పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ.. ఇండియా, ఎన్డీఏ కూటములకు సమాన దూరంలో ఉంటామన్నారు.
కాంగ్రెస్‌, బీజేపీల కంటే ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయని ఉదహరణలతో వివరించారు. ప్రజల ఆశీస్సులతో అనేక ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదిగాయన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు 75 ఏండ్ల పాటు పరిపాలించే సమయం లభించినప్పుడు ఏమీ చేయలేదని విమర్శించారు.
అందుకే బీఆర్‌ఎస్‌ జాతీయస్థాయిలో మరో రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్న దన్నారు. వచ్చే ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌, బీజేడీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మాత్రమే కాకుండా ఎవరైనా గేమ్‌ చేంజర్‌ కావచ్చని అభిప్రాయపడ్డారు.
కులగణననే కాకుండా సాధారణ జనగణన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. దేశంలో కులగణన జరగకపోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సమాన బాధ్యత వహించాల న్నారు. ఇప్పుడు కచ్చితంగా కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు.