బీజేపీ,బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలి

నవతెలంగాణ-గుండాల
నవంబర్‌ 30న తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రైతాంగ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టిన బీజేపీ,నిరుద్యోగ యువతను మోసగించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓడించి లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజల పక్షాన పోరాడే శక్తులను గెలిపించాలని సీపీఐ (ఎం) మండల కార్యదర్శి మద్దెపురం రాజు ప్రజలకు పిలుపునిచ్చారు.బుధవారం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సంపదను కొల్లగొట్టి అంబానీ ఆదానీలకు కట్టబెడుతూ,ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటేకరణ చేస్తూ,సామాన్య ప్రజలపై ప్రతినిత్యం పెట్రోలు డీజిల్‌ వంట గ్యాస్‌ నిత్యావసర వస్తువుల ధరల బారాలు మోపుతున్న బీజేపీని,రాష్ట్రంలో కార్మిక సంఘాల ప్రజా పోరాటాలను నిరంకుశంగా అణచివేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీలకు జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ నెల 30న తెలంగాణ శాసనసభకు జరుగబోయే ఎన్నికలలో బిజేపి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు ఓడించి అభ్యుదయ వాదులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ బత్తిని బిక్షం యండి ఖలీల్‌ మల్లెబోయిన బాలయ్య పాల్గొన్నారు.