– సమస్యలపై గళమెత్తే నాయకులను గెలిపించాలి:
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించడమే లక్ష్యమని, ప్రజా సమస్యలపై చట్ట సభలలో గళం వినిపించే వామపక్ష, ప్రజాతంత్ర వాదులను గెలించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అధికారంలోకి వచ్చిన బీజేపీ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని , మతోన్మాదంతో రాజకీయకంగా లబ్దిపొందాలని చూస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు. అభివద్ధి, సంక్షేమం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అమలకు నోచుకోని పథకాలు ప్రకటించి సొంత కార్యకర్తలకు ఇచ్చి నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బు, మద్యం లను నమ్ముకొని ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు పొందాలని చూస్తున్నారన్నారు. అలాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వామపక్ష, ప్రజాతంత్ర వాదులను గెలిపించుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులను గెలిపించాలన్నారు. కార్యకర్తలు ఈ ఎన్నికలో కష్ట పడి పని చేసి ప్రజలను చైతన్య పర్చలన్నారు. కాంగ్రెస్ పార్టీ తో రాజకీయ అవగాహన కుదురిందని చెప్పారు. దేశంలో బీజేపీ, రాష్టంలో బీఆర్‌ఎస్ ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిట్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, వన్, టూ టౌన్ కార్యదర్శులు డా.మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, సీనియర్ నాయకురాలు గాదె పద్మ, జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, వరలక్ష్మీ, పరుశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, సత్యనారాయణ రావు, దేశిరం నాయక్, వాడపల్లి రమేష్, మాధవ రెడ్డి, రాంచంద్రు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.