– రాష్ట్రానికి,దేశానికి కాషాయ పార్టీ ఏం చేసింది…?: బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర పేరిట ఊరూరా తిరుగుతున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. వారిది విజయ సంకల్ప యాత్ర కాదు.. అదో వికృత యాత్రంటూ ఆయన ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి ఏం ఒరగబెట్టిందని సూటిగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ లేదంటూ పదే పదే మాట్లాడుతున్న కమలం పార్టీ నేతలకు అలాంటప్పుడు తమ పార్టీని విమర్శించాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లుంటే.. వాటన్నింటినీ తమ పార్టీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఐటీఐఆర్ రద్దయితే ఎందుకు నోరు మెదపలేదు.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు గొంతెత్తలేదు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు తీసుకు రాలేకపోయారని విమర్శించారు. అలాంటప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటేయాలని అన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాత నియోజకవర్గమైన ముషీరాబాద్‌లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని రావుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడేది, ఇక్కడి ప్రజల వాణిని, బాణిని వినిపించేది బీఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి కాంగ్రెస్‌తో మాత్రమే పోటీ ఉంటుందని తెలిపారు. అంతే తప్ప బీజేపీతో కాదని స్పష్టం చేశారు.