– కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో తన ఉనికి చాటుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చార్జిషీట్ పేరిట కొత్త డ్రామాకు తెరతీసిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల్లో ఎన్నింటిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం అమలు చేశామనీ, ఇప్పటి వరకు కోటి 10 లక్షల మంది మహిళలు ప్రయాణించారని చెప్పారు. ఏక కాలంలో రూ.20 వేల కోట్ల రుణమాఫీ, రూ.500 లకే వంటగ్యాస్, సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోసన్ అందించిన సర్కార్ దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని గుర్తు చేశారు. బీజేపీ పదేండ్ల పాలనలో ఇచ్చిన ఒక్క హమీని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి పేదవారి లకౌంట్లల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఏటా రెండు కోట్ల చొప్పున పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎవరికిచ్చారో చెప్పాలని నిలదీశారు. దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హమీలపై సమాధానం చెప్పిన తర్వాతే కాంగ్రెస్‌పై మాట్లాడాలని హితవు పలికారు.