గిరిజనులను గెంటేసేందుకే బీజేపీ కుట్ర..

– అపాయంగా అటవీ పరిరక్షణ చట్టం -2022 నియమాలు
– భూముల్ని లాక్కుంటే బతికేదెట్లా?
– ప్రమాదంలో పర్యావరణం
– నామ్‌కేవాస్తేగా అనుమతులు
– తూతూ మంత్రంగా పరిహారం..
ఎస్‌ వెంకన్న
రాష్ట్రంలో గిరిజనులు.. : రాష్ట్రంలో 32 గిరిజన తెగలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 31.78లక్షలు కాగా, తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 36,02,288 మందిగా జనాభా ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన ఐదో షెడ్యూల్‌ ప్రాంతం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహాబూబ్‌నగర్‌లలోని తొమ్మిది జిల్లాల పరిధిలో 13,924.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1174గ్రామాలున్నాయి.
అడవిలో ఖనిజ సంపద..
షెడ్యూల్డ్‌ ప్రాంతంలో బొగ్గు, విలువైన ఉక్కు, ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ నల్లమల ప్రాంతంలో యురేనియం, ఇతర అటవీ ప్రాంతంలో రంగురాళ్లు, రాగి, తగరం, వనమూలికలు, జిగురు, అటవీ ఉత్పత్తులు తదితర విలువైన సంపద విస్తారంగా ఉన్నది.
కార్పొరేట్ల కోసమే.. : ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న అటవీ భూముల్లో బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అటవీ చట్టాలు అడ్డంకిగా వున్నాయి. విలువైన సహజ వనరులు, ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఆటంకంగా వున్న చట్టాలను వారికి అనుకూలంగా సవరించే పని మోడీ ప్రభుత్వం నెత్తినెత్తుకుంది. అందుకు కొత్త నియమ నిబంధనలు ప్రతిపాదించింది. అటవీ ప్రాంతంలో లీనియర్‌ ప్రాజెక్టులను (జాతీయ రహదారులు, పైపులైన్లు, ట్రాన్స్‌మిషన్‌…) ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి గిరిజన గ్రామసభ అనుమతి అక్కర్లేదని 2013లో కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను 2019లో ఎ.పి హైకోర్టు కొట్టేసింది. గిరిజన గ్రామసభకు వున్న విస్తృత అధికారాన్ని న్యాయస్థానం గుర్తించడంతో, ముసాయిదా బిల్లులో గ్రామసభను సంప్రదించాలని మాత్రమే కేంద్ర బీజేపీి ప్రభుత్వం పేర్కొన్నది.
నిబంధనలకు పాతర..
అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు వినియోగించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా చట్టంలోని నిబంధనలు పాటించాలి. 1. ముందుస్తు గ్రామసభ అనుమతి తీసుకోవాలి. 2. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి. 3. అడవులు పెంచడానికి ప్రత్యేక భూమి కేటాయించాలి. ఈ నిబంధనలు కార్పొ రేట్‌ శక్తులకు అడ్డుగా వుండడంతో వీటికి సవరణ పేరుతో పాత రేసింది. మైనింగ్‌ కోసం ఐదు హెక్టార్ల భూమిని డి-రిజర్వ్‌ చేయడానికి, ఆక్రమణ భూమిని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ సిఫార్సు అవసర మనీ, 2003లో జారీ చేసిన నియమాలను పక్కనబెట్టి, మోడీ సర్కారు కొత్త నియ మాలు తీసుకొచ్చింది. క్లాజ్‌ 9(బి)-1 ప్రకారం గ్రామసభ లేదా హక్కుల పరిష్కార ప్రస్తావన లేదు. క్లాజ్‌ 9(బి)-2 ప్రకారం డి-రిజర్వుడు ఆర్డర్‌ను జారీ చేయడానికి గ్రామసభకు వున్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్నది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఆదివాసుల హక్కులు హరించబడతాయి.
గిరిజన హక్కులకు తిలోదకాలు..
పోరాడి సాధించుకున్న గిరిజన హక్కుల చట్టాలకు పాడెకట్టేందుకు బీజేపీ సర్కార్‌ సిద్దమవుతున్నది. పర్కావరణాన్ని ప్రమాదంలోకి నేట్టేసి, కార్పొరేట్లకు అటవీ భూముల్ని కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నది. అడవుల్ని నమ్ముకుని బతుకుతున్న కోట్లాది మంది బతుకులు ఆగం చేసే నిర్ణయం మోడీ సర్కారు తీసుకున్నది. ఆదివాసీలు, గిరిజనుల అనుమతి అవసరం లేకుండా అటవీ భూముల్ని వివిధ ప్రాజెక్టులకు వినియోగించే ప్రక్రియకు పాల్పడుతున్నది. ‘అటవీ పరిరక్షణ నియమవాళి – 2022’ తో..అటవీ హక్కుల చట్టానికి సమాధి కడుతున్నది.
ఉద్యమమే..
అటవీ భూముల వాడకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమని పలువురు రాజకీయ, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రబాద్‌ నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు కేంద్రం సిద్దపడితే..గిరిజనులు, ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. దీంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఈ తరహాలోనే కేంద్రం తెస్తున్న నియమాలను నిలవరించేందుకు తగిన విధంగా ఉద్యమాలను నిర్మించటమొక్కటే మార్గమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయివేటు డెవలపర్స్‌కు అన్ని అనుమతులు కేంద్రమే ఇచ్చిన తర్వాత..ఇక కలెక్టర్లతో పనేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. గిరిజనుల హక్కులు,పరిరక్షణ, అంతా తూతూమంత్రంగా చేయటం తగదని వారు హితవు పలుకుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా..
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా పరిగణలోకి తీసుకోవటం లేదు. ఆదివాసుల సాంప్రదాయ హక్కులతో ముడిపడిన హక్కుల నిర్ధారణ తర్వాతే… అటవీ భూమి మళ్లింపు అనుమతులను పరిశీలిం చాలని ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు మధ్య నడిచిన కేసులో…2013 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ హక్కుల అమలు విషయంలో గ్రామసభ పాత్రను, అటవీ భూమి మళ్లింపు విషయంలో వాటి అనుమతి అవసరాన్ని తీర్పులో స్పష్టం చేసింది. అయినా మోడీ సర్కారు మొండిగా గ్రామసభ, అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తున్నది.