కేసీఆర్‌ దోపిడీకి బీజేపీ సహకారం

BJP's cooperation in exploiting KCR– టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
–  కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత వినరురెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ దోపిడీకి పాల్పడుతున్నారనీ, అందుకు బీజేపీ సహకారం కూడా ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినరురెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు రేవంత్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌తో కొట్లాడే వారికి బీజేపీ పదవులు ఇవ్వలేదని చెప్పారు. ఈ పరిస్థితి రాష్ట్రమంతా ఉందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టిన బీజేపీ…సీఎం కేసీఆర్‌పై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? మహా త్ముడా? అని నిలదీశారు. శాండ్‌, ల్యాండ్‌, మైన్‌ అన్ని దందాల్లో బీఆర్‌ఎస్‌ నేతలే ఉన్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చు చేసి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ రూ.5వేల కోట్లు ఖర్చు చేయాలని ప్లాన్‌ చేశారని తెలిపారు. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. జమిలి పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయని చెప్పారు. ఇద్దరు కాదు… వంద మంది వచ్చినా కాంగ్రెస్‌ను ఏం చేయలేరని హెచ్చరించారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.