– బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓట్లడిగే హక్కు లేదు : కిషన్‌రెడ్డి, బండికి మంత్రి పొన్నం బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిజర్వేషన్ల పట్ల బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందంటూ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి , ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వుండే బీజేపీకి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓట్లడిగే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 1986లో రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ ఆధ్వర్యంలో మురళీధర్ రావు కమిషన్ ఈబీసీ రిజర్వేషన్ల అమలుకి సంబంధించిన విషయంలో వాటిని రద్దు చేసేందుకు కుట్ర చేసిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే బీజేపీ దేశ వ్యాప్తంగా కమండల యాత్ర చేపట్ట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా…? అని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కుల గణన సర్వే జరపాలనీ, ఎవరికెంతో – వారికంత అనే నినాదమిస్తే.. దానికి భిన్నంగా ప్రభుత్వం తరుపున కుల గణన సర్వేకి సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా…? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు పెంచిన బీహార్ ప్రభుత్వాన్ని 60 రోజుల్లోనే కూల దోసింది బీజేపీ ప్రభుత్వం కాదా..? అని గుర్తు చేశారు. బీహార్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు 50 నుంచి 65 శాతానికి రిజర్వేషన్లు పెంచిందని గుర్తు చేశారు.
దీన్ని తట్టుకోలేక జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ,వామపక్షాల ప్రభుత్వాన్ని కూల్చి అస్థిరపర్చలేదా? అని ప్రశ్నించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమానత్వం కోరుకునే వాళ్ళంతా నక్సలైట్లు అంటున్నారు కదా?.. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమానత్వం కోరుకుంటే నక్సలైట్లు అవుతారా…? ఇది రాజ్యాంగంపై దాడి కాదా ? అని ప్రశ్నించారు. సివిల్ సర్వీస్‌లకు సంబంధించి ఐదేండ్లుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి సమాధానంగా ఐదేండ్లలో సివిల్ సర్వీస్‌లలో ఓబీసీలకు 27 శాతం వాటా దక్కాల్సి ఉండగా, 15.92 శాతం, ఎస్సీలకు 15 శాతానికి 7.65 శాతం, ఎస్టీలకు 7.5శాతానికి 3.8శాతం మాత్రమే వాటా దక్కిందని పేర్కొన్నారు. మొత్తం 4,365కు గాను 1,195 మంది మాత్రమే బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లలో ఉన్నారని తెలిపారు. ఈ అన్యాయానికి బాధ్యత బీజేపీది కాదా? అని ప్రశ్నించారు. 30 ఏండ్ల తర్వాత బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ తిరిగి మళ్ళీ ఇస్ బార్ చార్ సౌ అని 400 స్థానాలు అడుగుతున్నారంటే 2/3 మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసి నియంతృత్వంగా కొనసాగించడానికి ఎలాంటి హిడెన్ ఎజెండా లేదని చెప్పగలరా ? అని ప్రశ్నించారు.
దేశ సంపదంతా ఎల్‌ఐసీ , బీఎస్‌ఎన్‌ఎల్ , విమానాశ్రయాలు, పోర్టులు , జాతీయ రహదారులు, అదానీ , అంబానీలకు అప్పగించి, గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ. 150 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఊపర్ జై శ్రీరాం – అందర్ రిజర్వేషన్‌కు రాం రాం అంటున్నారని మర్శించారు.