– అధికారంలో భాగస్వామిని చేసేందుకు జడ్‌పీఎం ససేమిరా
– కమలదళం హిందూత్వ అజెండాయే కారణం
న్యూఢిల్లీ : మిజోరంలో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో చేరాలని ఆశించిన బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీని అధికార కూటమిలో చేర్చుకునేందుకు లాల్‌దుహోమా నేతృత్వంలోని జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ (జడ్‌పీఎం) పార్టీ నిరాకరించింది. దీంతో ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ అధికార భాగస్వామిగా ఉంటూ తన ప్రాభవాన్ని ప్రదర్శించాలని తహతహలాడిన కమలదళానికి భంగపాటు తప్పలేదు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలలో ఒక్క మిజోరంలో మినహా మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ అధికార కూటమిలో కొనసాగుతోంది.
మిజోరం శాసనసభలో బీజేపీ తన బలాన్ని ఒకటి నుంచి రెండుకు పెంచుకోగలిగింది. 2018 ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) నిరాకరించింది. బీజేపీ నేతృత్వంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రజాస్వామిక కూటమి (ఎన్‌ఈడీఏ)లో ఎంఎన్‌ఎఫ్ భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ అది బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలో దిగింది. ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత కూడా ఆ పార్టీ బీజేపీని మంత్రిమండలిలో చేర్చుకోలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే అధికార పార్టీలు మారాయి. ఎంఎన్‌ఎఫ్‌తో పోలిస్తే కేంద్రంలోని అధికార బీజేపీతో జడ్‌పీఎం పార్టీయే సన్నిహితంగా ఉంటోంది. అయినప్పటికీ ప్రభుత్వంలో కమలదళానికి చోటు కల్పించలేదు. మిజో పార్టీలు ‘ఎక్కడైనా బావే కానీ…’ అనే ధోరణితో వ్యవహరించడం గమనార్హం.
ఈసారి ఎలాగైనా ప్రభుత్వంలో చేరాలని బీజేపీ ఉవ్విళ్లూరింది. ఓట్ల లెక్కింపు జరిగిన రోజున ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వంలో తమ పార్టీ భాగస్వామిగా చేరుతుందని ఢంకా బజాయించి మరీ చెప్పారు. క్యాబినెట్‌లో కనీసం ఒక బీజేపీ ఎమ్మెల్యేకు అయినా చోటు ఇవ్వాలని లాల్‌దుహోమాపై ఒత్తిడి వచ్చిందని జడ్‌పీఎం వర్గాలు తెలిపాయి. అయితే జడ్‌పీఎం నాయకత్వం అందుకు ససేమిరా అన్నది. అందుకు కారణం లేకపోలేదు. మిజోరంలో క్రైస్తవ జనాభా ఎక్కువ. బీజేపీ అవలంబించే హిందూత్వ రాజకీయాల గురించి మిజోలకు బాగా తెలుసు. అందుకే గత ఎన్నికలలో ఎంఎన్‌ఎఫ్ కానీ, ఈ ఎన్నికలలో జడ్‌పీఎం కానీ బీజేపీని దూరం పెట్టాయి.
లాల్‌దుహోమా ఆదివారం నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలి రోజే ఆయన తన పార్టీ సహచరులతో కలిసి మిజోరం చర్చి నాయకత్వ కమిటీ పెద్దలతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడు జడ్‌పీఎం కేంద్ర కార్యాలయంలో క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు కూడా జరిపారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద సమాజంగా ఉన్న మారాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలోనే బీజేపీ రెండు స్థానాలు గెలుచుకుంది. మారాలు కూడా క్రైస్తవులే. అయితే వారు బీజేపీ హిందూత్వ సిద్ధాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మారాలలో కీలక నేతలుగా ఉన్న వారు మారా స్వయంపాలిత మండలిపై పెత్తనం చెలాయిస్తున్నారు. వారు చెప్పిన దానికల్లా మారాలు తల ఊపుతారు. బీజేపీని సమర్ధించాలని మారా నేతలు నిర్ణయించడంతో వారు కూడా దానికి అనుగుణంగానే ఓటేశారు. అయితే మారాలు, బీజేపీ నేతల మధ్య ఈ స్నేహబంధం ఎన్ని రోజులు కొనసాగుతోందో చెప్పలేము.