నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వతంత్ర మీడియా సంస్థ న్యూస్‌క్లిక్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు దాడిని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్, జర్నలిస్టులు, సిబ్బందిపై పోలీసులు దాడి చేసి అనేక మందిని ఉపా కేసు కింద అరెస్టు చేయడం సరైంది కాదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిపై ఉపా కేసును వెంటనే ఉపసంహరించాలని కోరారు. వారితో విభేదించే, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే వారిని నిజం మాట్లాడే ప్రతి గొంతునూ నలిపేయడమే బీజేపీ పాలనలో ఓ విధానంగా ఉందని విమర్శించారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఈ దాడిని దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు.