‘హంగ్‌’ కోసం బీజేపీ ఆరాటం

'హంగ్‌' కోసం బీజేపీ ఆరాటం– రేవంత్‌రెడ్డి పక్కా ఆర్‌ఎస్‌ఎస్‌ వాది
– 110 స్థానాల్లో ‘మామ’ను గెలిపించండి
– ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఏఐఎమ్‌ఐఎమ్‌ అధ్యక్షులు అసదుద్దీన్‌ ఓవైసీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గాంధీభవన్‌ రిమోట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ చేతుల్లో ఉందనీ, ఆయన ఎలా చెప్తే, ఇక్కడి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అలా నడుస్తారని ఆలిండియా మజ్లిస్‌ ఏ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎమ్‌ఐఎమ్‌) అధ్యక్షులు అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. రేవంత్‌రెడ్డి పక్కా ఆర్‌ఎస్‌ఎస్‌ వాది అనీ, గతంలో ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారంనాడిక్కడి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో తమపార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నదనీ, మిగిలిన 110 నియోజవర్గాల్లో ‘మామ’ (సీఎం కేసీఆర్‌)కు మద్దతు ఇస్తున్నామనీ స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలంటే, ఓట్లు చీలకూడదనీ, అందువల్లే తాము బలంగా నిజమాబాద్‌ రూరల్‌, అర్బన్‌, కరీంనగర్‌, ముషీరాబాద్‌, మహబూబ్‌నగర్‌ వంటి స్థానాల్లో కూడా పోటీ చేయట్లేదన్నారు. కాంగ్రెస్‌ అసమర్థత వల్లే అక్కడ బీజేపీ గెలుస్తున్నదనీ, దాన్ని ఒప్పుకోలేకే తమపై నిందలు వేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, క్రికెటర్‌ అజారుద్దీన్‌పై పోటీ చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
ఆ స్థానం నుంచి తాము చాలా సంవత్సరాలుగా పోటీచేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో మతం ప్రాతిపదిక కాదనీ, తమది సెక్యులర్‌ పార్టీ అని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌తో తమకు ఎలాంటి ఎన్నికల పొత్తు లేదనీ, అలాగని ప్రత్యర్థులమూ కాదన్నారు. ఎన్సీఆర్టీలో రామాయణం, మహాభారతం వంటి పాఠ్యాంశాలు చేర్చడంపై స్పందిస్తూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి వారి పాఠాల్ని ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో హంగ్‌ రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదనీ, దానివల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందాలనేది ఆపార్టీ రాజకీయ ఎత్తుగడ అని విశ్లేషించారు. కానీ రాష్ట్ర ఓటర్లు చైతన్యవంతులనీ, ఆ అవకాశం బీజేపీకి ఇవ్వబోరని విశ్వాసం వ్యక్తంచేశారు. కార్యక్రమానికి విరాహత్‌ అలీ సమన్వయకర్తగా వ్యవహరించారు. టీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్‌ఏ మాజిద్‌, హెచ్‌యూజే నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.