నవతెలంగాణ – కంఠేశ్వర్
బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక విధానాల వల్ల రాజ్యాంగ మౌలిక సూత్రాలకే పెను ప్రమాదమని మార్క్సిస్టు -అంబేడ్కరిస్టు సైద్ధాంతిక విశ్లేషకులు రచయిత సాదు మాల్యాద్రి ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బి ఎల్ పి తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో రెండవ రోజు ఆదివారం ప్రతినిధుల సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మార్క్సిజం- అంబేడ్కరిజం శ్రామిక వర్గ ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం అంశంపై మాట్లాడారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం ఇంకా దేశంలో కుల వివక్షతతో కూడిన అసమానతలు పెరిగాయని తెలిపారు. భారత బహుజన శ్రామిక ప్రజలు గౌతమ బుద్ధుడు, మహాత్మా జోతిబా ఫూలే, సావిత్రమ్మ ఫూలే, అంబేడ్కర్ అంబేడ్కర్, సాహు మహారాజ్, పెరియార్ లాంటి మహానీయుల ఆలోచన విధానంతో ఉద్యమించడం ద్వారా బిజెపి మతోన్మాద రాజకీయాలను ఓడించడం సాధ్యమవుతుందని సాదు మాల్యాద్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు విప్లవ శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ద్వారా అధికారంలోకి వస్తున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో శ్రీలంకలో మార్క్సిస్టు పార్టీ నేత ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించే బిజెపి నాయకులు వాజపేయ్ ఐదు సంవత్సరాలు, ప్రస్తుత మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాలు మొత్తం 16 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ పాలన కంటే ఏ విషయంలో భిన్నంగా ఉందని సాదు మాల్యాద్రి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మద్దతు ధర కోసం ఉద్యమించిన రైతులపై కనీస వేతనాల చట్ట కోసం ఉద్యమించిన కార్మిక వర్గంపై మోదీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేత చర్యలకు పాల్పడుతుందన్నారు. రెండవ రోజు ప్రతినిధుల సభకు ఆ పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు వడ్ల సాయి కృష్ణ, ముద్రకోల ఆంజనేయులు, పోషవ్వ, సి.హెచ్, కళా, అరుణలు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ది రాములు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత, బ్రాహ్మణపల్లి జగదీష్ ,మహిముద్, నాగారపు ఎల్లయ్య,ఎం. అజయ్, మనున్ జీజా బాయి, పద్మిని వాగ్మారే,ఎస్.డి. సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.