– అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తరలింపు
– ఒక్కో ఎంపీ స్థానం నుంచి 1400 మంది తరలింపు
– 200 మందికో ఇన్‌చార్జి నియామకం
ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు అస్థా రైళ్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అయోధ్యలో రామ మందిరాన్ని చూపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రాల్చుకునే పనికి బీజేపీ పూనుకున్నది. ప్రజల్లోని భక్తి అనే సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో తెలంగాణ శాఖ పడింది. అందులో భాగంగానే అయోధ్యకు అస్థాపేరుతో ప్రత్యేక రైళ్లను బుక్‌చేసింది. వాటి ద్వారా రోజుకు 1400 మంది చొప్పున అయోధ్య పర్యటనకు తరలించనున్నది. ఈ రైళ్లు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు నడువనున్నాయి. ఒక్కో రైలులో 20 బోగీలుంటాయి. ప్రతి బోగికి ఒక ఇన్‌చార్జి ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో రామాలయం సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని తెలంగాణలో వీలైనంత మేరకు ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ పర్యటనలని ప్రచారం జరుగుతున్నది. అయోధ్యకు తెలంగాణ నుంచి సందర్శకులను తీసుకెళ్లేందుకు బీజేపీ తెలంగాణ శాఖ షెడ్యూల్‌ను తయారు చేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం కల్పించనున్నట్టు తెలిసింది. ఒక్కో ట్రైన్‌లో పార్లమెంట్ స్థానం పరిధిలోని1400 మందికి అవకాశం కల్పించనున్నారు. అయోధ్య పర్యటనకు వెళ్లి రావడానికి ఐదు రోజుల సమయం పడుతుంది కాబట్టి ఒక్కో భోగికి ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ విభాగాలకు చెందినవారు, బీజేపీ నాయకులు ఇన్‌చార్జిగా ఉంటారని తెలిసింది. మొదటి రైలులో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన వారిని ఈ నెల 29న తీసుకెళ్లనున్నారు. ఒక్కో నియోజకవర్గం వారిని ఒక్కో రోజు తీసుకెళ్లనున్నారు. ఈ పర్యటన జహీరాబాద్ నియోజకవర్గంతో ఫిబ్రవరి 15న ముగియనున్నది. ఇందులో పార్టీలతో సంబంధం లేకుండా దైవ భక్తి ఎక్కువగా ఉండేవారినీ, గ్రామంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసే వారిని తరలించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇదంతా ప్రజలను అయోధ్య యాత్రకు తీసుకెళ్లి హిందూత్వ భావజాలం వైపు పూర్తిగా మోల్డ్ చేసే పనిలో భాగమేనని తెలుస్తోంది. వారి ద్వారా గ్రామాల్లోని ఓటర్లను ప్రభావితం చేసి ఓట్లు మలుచుకునే ప్రయత్నం దాని వెనుక ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఏ నియోజకవర్గం వారు ఎక్కడ నుంచి అంటే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి : సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్‌గిరి, మెదక్ పార్లమెంట్ స్థానాల వాళ్లు. కాజీ పేట రైల్వే స్టేషన్ నుంచి : వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి.
నియోజక వర్గాల వారీగా..
1.సికింద్రాబాద్ – జనవరి 29
2.వరంగల్ – జనవరి 30
3.హైదరాబాద్ – జనవరి 31
4.కరీంనగర్ – ఫిబ్రవరి 1
5.మల్కాజ్ గిరి – ఫిబ్రవరి 2
6.ఖమ్మం – ఫిబ్రవరి 3
7.చేవెళ్ల- ఫిబ్రవరి 5
8.పెద్దపల్లి – ఫిబ్రవరి 6
9.నిజామాబాద్ – ఫిబ్రవరి 7
10.అదిలాబాద్- ఫిబ్రవరి 8
11.మహబూబ్నగర్ – ఫిబ్రవరి 9
12.మహబూబ్ బాద్ -ఫిబ్రవరి 10
13. మెదక్- ఫిబ్రవరి 11
14.భువనగిరి – ఫిబ్రవరి 12
15.నాగర్ కర్నూల్- ఫిబ్రవరి 13
16. నల్గొండ – ఫిబ్రవరి 14
17. జహీరాబాద్ – ఫిబ్రవరి 15