బ్లాక్‌ డాగ్‌

Black Dogఅనగనగా ఓ సాధువు వున్నాడు. ఆ సాధూ మహరాజ్‌ ఓ అరుగుమీద కూచున్నాడు. ఆ అరుగు ఓ చెట్టుకింద వున్నది. చెట్టుకింద వున్న అరుగు మీద కూచుని ముక్కు మూసుకునున్న ఆ సన్యాసి వున్నది ఓ అడవిలో. ఆయన జుట్టు అట్టలు కట్టింది. గడ్డం బొడ్డు కనపడకుండా పెరిగేసింది. అయినా ఎలాంటి చిరాకు లేకుండా తపస్సు కంటిన్యూ చేయసాగాడు.
అదేదో ఊళ్లో వుండేది అది. ఆ ఊళ్లో పట్టడానికి దొంగ కోళ్లు అయిపోడంతో ఇంకో ఊరికి బయలుదేరిందది. అలాగ అదేదో ఊళ్లో నుంచి బయలుదేరిన అది అడవి బాటపట్టింది. అడవి దాటితే మరో ఊరు పౌల్ట్రీ ఫాం చేరుకోవచ్చని ఆశపడిందది. అలాగ గంపెడంత ఆశను మోసుకుంటూ వచ్చిన దానికి అరుగుమీద తపస్సు చేసుకుంటున్న స్వామీజీ కనిపించాడు. అరుగు ఎదురుగ్గా కూచుని ఎప్పుడు కళ్లు తెరుస్తాడా, తనకు వచ్చిన డవుట్‌ను క్లియర్‌ చేస్తాడా అని చూసింది. కానీ బవిరి గడ్డం వాడు ఎంతకీ కళ్లు తెరిచి చూడకపోవడంతో సహనం సంపూర్ణంగా నశించి దానికి అలవాటయిన అరుపు అరవసాగింది.
భౌ.. భౌ.. మన్న శబ్దం చెవుల్లో జొరబడి గుబిలి బయటకు తియ్యడానికి ట్రై చేస్తుండడంతో కళ్లూ ముక్కూ తెరిచిన మునివరేణ్యుడు ఎదురుగ్గా వున్న కాలభైరవుడ్ని కనులారా కాంచి, బాగా పరికించి మామూలు గ్రామసింహమేనని గుర్తించి ఏమిటి ఈ కుక్క గోల అని అరిచాడు.
సారీ స్వామీ, వెరీ సారీ! తమర్ని ఓ మాట అడుగుదామని డిస్ట్రర్‌ చేశా! అంది కుక్క తలవంచుకుని.
అసలు నీకు మాటలెలావచ్చాయి, మనిషిలా మట్లాడగల్గుతున్నావు? ఎక్కడ నేర్చావు, ఎక్కడ చదివావు? అనడిగాడు మునిపుంగవుడు.
లేదు, స్వామీ లేదు. నేను ఏ రానాయణ కాలేజీలోనూ, తైచన్య కళాశాలలోనూ, మురికి కూపంలాంటి హాస్టల్లో వుంటూ, ర్యాంకుల కోసం మాస్టర్లు రాచి రంపపు కోత కోస్తుంటే భరిస్తూ చదువుకున్న డాగ్‌ని కాదు. నేనిలాగ మాటాడ్డానికి కారణం మీ అరుగు చుట్టూ వున్న మీ జ్ఞాన భక్తి వైరాగ్య మహిమ కావచ్చు అన్నది అదేదో ఊళ్లోనుంచి వచ్చి మరేదో ఊళ్లోకి వెళ్లాలనుకుంటున్న కుక్క.
ఓ ఐసీ! అలాగా. నా మహిమ నాకే తెలీకుండా పోయింది స్మీ. సరే ఏదో అడుగుదామనుకున్నావు కదా, అడిగి ఏడు అన్నాడు మునుడు.
ఏం లేదు స్వామీ, మీరిలాగ గడ్డమూ జుట్టూ పెంచి అరుగుమీద తపస్సు ఎందుకు చేస్తున్నారు. దీనివల్ల బెనిఫిట్స్‌ ఏమిటి?
అప్పుడు స్వామి నవ్వాడు కానీ గడ్డం అడ్డం వచ్చి నువ్వు కనపళ్లేదు. తపస్సు చేస్తే ముక్తి కలుగుతుంది. ముక్తి అంటే స్వర్గలోకానికి వీసా దొరుకుతుంది. దేవుడు ప్రత్యక్షమై ప్రసాదిస్తాడు అన్నాడు చెట్టుకింద వున్నోడు.
అయితే నేనూ తపస్సు చేయనా, నాకూ స్వర్గానికి వీసా వచ్చేస్తుందా అనడిగింది అమాయకంగా కుక్క.
నో! వీల్లేదు నీకు రాదు! స్వర్గం, నరకం అనేవి మనుషులకే కాని నాలుక్కాళ్ల పశువులకు కాదు అన్నాడు ముని వెటకారంగా.
ఇదేం అన్యాయం! దేవుడు, మనుషుల పక్షపాతి అన్నమాట. ‘ఇన్‌జ్యుడీషియస్‌’. అనగా అన్యాయం, అక్రమం అంది కుక్క.
నా ఈ అరుగు చుట్టూ నా కారణంగా విస్తరించిన మహిమ కారణంగా మాట్లాడుతున్న నువ్వు తపస్సు చేస్తే ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌గా నిన్ను మనిషిని చేయవచ్చు. ఆ తర్వాత స్వర్గమూ ప్రాప్తించవచ్చు అన్నాడు రుషి.
కుక్క ఆ పక్కనున్న అరుగు ఎక్కి తపస్సు మొదలు పెట్టింది. ఎన్నాళ్లయినా దేవుడు నేనే అని ఎవరూ రాలేదు. అసలే సహనం తక్కువ స్థాయిలో వున్న కుక్కకు పిచ్చికోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే దేవుడనే వాడు ఎదురుగ్గా వచ్చి నిలబడితే కరిచి కండపీకుదామన్నంత కోపం.
ఇది గమనించిన అరుగుమీద పుణ్యపురుషుడు, ఏంటి డాగూ… దేవుడు దిగిరావడం అంత ఈజీ కాదు. మనిషి రూపమూ ఆపైన స్వర్గంలోకమూ మామూలు బిగ్‌బాస్‌ టాస్క్‌ కాదు. ఇప్పుడేం చేస్తావు అన్నాడు.
ఏముంది? పిచ్చెక్కినట్టుంది. ఎవడు కనిపిస్తే వాడ్ని కరవాలనిపిస్తున్నది అంది కుక్క.
పిచ్చి కుక్కా… నువ్వు కరిచిన ప్రతి వాడికీ పిచ్చెక్కుతుంది. ప్రతివాడికీ పిచ్చెక్కడానికి కారణం నువ్వు కరవడమేనని తెలిస్తే బుర్ర బద్దలు కొట్టి చంపేస్తారు. ఇదిగో కమండలంలోని మంత్ర జలం. నెత్తిన చల్లుతున్నా. ఇక నువ్వు ఎవరికీ కనపడవు. నీ ఇష్టం వచ్చిన వాడ్ని కసితీరా, కరువుతీరా కర్చు, కరిచీ కరిచీ పిచ్చెక్కించు అంటూ కుక్క నెత్తిన మంత్ర జలం చల్లాడు.
అడవి దాటిన నల్లకుక్క ఏకంగా ఓ పెద్ద సిటీకి వచ్చేసింది. అక్కడయితే జనాలు ఎక్కువగా వుంటారని, వీలయినన్ని ఎక్కువ పిక్కలు కొరుక్కోవచ్చని. అక్కడ ఎక్కడ చూసినా జనమే జనం. అయితే గియితే మామూలోళ్లనీ, మంచోళ్లనీ ముట్టుకోకూడదని నిర్ణయించుకున్న బ్లాక్‌ డాగ్‌ రకరకాల పార్టీల ఆఫీసుల్లో జొరబడింది. అక్కడ ఎవరికీ అగుపడకుండా దొరికినోళ్ల కాళ్లూ పిక్కలూ టేస్టు చేసింది, కార్లల్లో వచ్చి దిగినవాళ్లకు కనబడకుండా. కుక్క కరిచినవాళ్లందరికీ అబ్బా ఏదో కరిచినట్టుంది అనిపించింది. అక్కడ్నించి చట్టసభా భవనాల వైపు వచ్చింది. కండువాల రంగు పట్టించుకోకుండా అందిన కాడికి కరిచేసింది. కరిచిందేమిటో అర్థం అవలేదుకానీ కొందరు మాత్రం ఓ నల్ల కుక్క కనపడీ కనపడనట్టు కనిపించి కనిపించకుండా పోయిందన్నారు.
మొత్తం మీద కరిచిందేదైనా ప్రమాదమేమీ లేదనుకున్నారు. అయితే అందరి నాలుకల లోనూ తేడా తెలిసి రాలేదు. లీడర్లందరూ ఒకరినొకరు బూతులు తిట్టుకోసాగారు. తట్టలకొద్దీ దుమ్మెత్తి పోసుకోసాగారు. నీకు మదమెక్కిందంటే, నీకు తలతిక్కుందనుకున్నారు. ఒకరి తాట ఒకరు తీస్తామన్నారు. ఒకరినొకరు ముక్కు నేలకు రాయించుతామన్నారు. ఓ నాయకుడు పుకార్ల చేత షికార్లు చేయించాడు. ఓ నాయకురాలు నాలుక చేంతాడంత సాగి అసందర్భపు కూతలు కూసింది. అడ్డదిడ్డంగా ఆరోపణలు చేసింది. ఇక చెప్పేదేముంది నల్లకుక్క కరిచిన నేతన్నలందరూ అన్ని హద్దులూ చెరిపేసుకుని ఒళ్లు తెలీకుండా వాగిందే వాగసాగారు.
ఇప్పుడు ఆ కనిపించని నల్లకుక్క దేశం అంతా తిరగసాగింది. ఎప్పటిలాగే మామూలోళ్లనీ, మంచోళ్లనీ కరవక వదిలేసి రాజకీయమే వృత్తిగా, ప్రవృత్తిగా సకలంగా, సర్వంగా, సర్వస్వంగా, స్వంత లాభంగా చేపట్టిన వాళ్లని మాత్రం కరవక వదలడం లేదు.
– చింతపట్ల సుదర్శన్‌
9299809212