నల్ల చట్టాలను రద్దు చేయాలి

– రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
– రైతు వ్యతిరేక విధానాలపై ఆమనగల్‌లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
నవతెలంగాణ-ఆమనగల్‌
కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదింప జేసి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల కిందట తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సంవత్సరం పాటు చేసిన ఆందోళనలో 700 మంది రైతులు అమరులు అయ్యారని గుర్తు చేశారు. రాత్రిపగలు తేడా లేకుండా దేశవ్యాప్తంగా రైతులు ఏకతాటిపై నిలిచి చేసిన పోరాటానికి దిగొచ్చిన కేంద్రం నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని చెప్పారు. నేడు దొంగ దారిన వాటిని అమలు పరిచేందుకు కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మతోన్మాద శక్తులతో జతకట్టి ప్రజలను మభ్యపెట్టి మరోసారి మోసం చేయడానికి సిద్ధమౌతుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీరం చేస్తూ వ్యవసాయ రంగంలో యంత్రాలను ప్రవేశపెత్తూ రైతు, కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రాంచందర్‌, జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్‌ రడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.జంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలకు తూట్లు పొడిచే విధంగా 4 లేబర్‌ కోడ్‌లుగా విభజించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను హరిస్తోంద న్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో రైతులు, వామపక్ష, ప్రజాతంత్రవాదులు, వ్యవసాయ కార్మి కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల భాస్కర్‌, సహాయ కార్యదర్శి ముసలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య, కార్యదర్శి కందుకూరి జగన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.కుమార్‌, జీఎంపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేష్‌, రైతు సంఘం ఆమనగల్‌ ఏరియా నాయకులు కాన్గుల వెంకటయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పిప్పళ్ల శివశంకర్‌, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.