నల్లరేగడి

Blackcurrantపాలలో ముంచి తీసినట్లుండే
మహేష్‌ బాబు కాదు
నల్లని వాడు
పద్మనయనంబులు లేనివాడు
క్లాసులో ఎంతో మంది మహేషులు ఉంటే
ఇంటిపేరుతో కలిపి సీతా మహేష్‌ అని పిలుస్తాము

ఆ చేతులను తాకితే
కంకరరాళ్ళను దోసిట్లోకి తీసుకున్నట్లుంటది
ఆ పెద్దనేలు గోరు కింద
నల్లగా పేరుకుపోయిన రక్తం

తన కండ్లలోకి చూస్తే
కూలిపోతున్న బతుకుగోడకు వేసిన
కలల నిచ్చెనలు కనబడుతుంటయి

మహేష్‌ ఏం చేస్తాడని అనుకుంటున్నారా ?
మహేష్‌ ఏదైనా చేస్తడు

పెట్రోలు బంకులో నైట్‌ డ్యూటీ చేసి
ఇంటికి సెంట్రీలా నిలబడుతాడు
ఫంక్షన్‌ హాల్లో స్టేజీ డెకరేషన్‌ చేసేటప్పుడు
ఆవలింతలొస్తుంటే
తన కంటి పుష్పాలను అతికిస్తాడు
పగిలిన పెదవుల మీద
నవ్వుల నదులను పారిస్తూ ఉంటడు

పెయింటింగ్‌ పనికి పిలిస్తే
పాతబట్టలను దేవులాడుకొని
రంగుల్లో ముంచిన బ్రెషవుతడు

మహేష్‌ ఏదైనా చేస్తడు
వాకిండ్లు ఊడ్చి చదివించే అమ్మను
నాయినలాగ చూసుకుంటడు
తాటికమ్మల గుడిసె కూలకుండా
ఆసరయ్యే ఒక వాసమైతడు

బడికెందుకు రాలేదని
ఓసారి బయట నిలబెడితే
పూటెల్లాలంటే..
సావు డప్పు కూడా కొట్టబోవాలెగా సార్‌ అని
దిద్దవలసిన కరడా కాపీని చేతిలో పెట్టిండు

మహేషును ఎప్పుడు చూసినా
అంటరాని వసంతంలోని ఎల్లన్న పాత్ర
కండ్లముందట తిరుగాడుతున్నట్లుంటది

గజం భూమి లేదు
గారువంగా చూసుకునే నాయిన లేడు
మహేష్‌ అంటే
తమ్ముడి, చెల్లెండ్ల ఆశలను
తన గుండెలో విత్తనాలుగా చల్లుకున్న
పద్దెనిమిదేండ్ల నల్లరేగడి పొలం

– తగుళ్ళ గోపాల్‌, 9505056316