ఖాళీలు చూపించడం లేదు

– అమ్ముకునేందుకు పథకం వేస్తున్నారు : మెడికల్‌ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కౌన్సిలింగ్‌లో జీవో నెంబర్‌ 273 ప్రకారం అన్ని ఖాళీలను చూపించడం లేదనీ, వాటిని అమ్ముకునేందుకు కొంత మంది పథకం వేస్తున్నారని మెడికల్‌ జేఏసీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ మెడికల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మెన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నిర్వహించబోయే కౌన్సిలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలింగ్‌ ప్రమోషన్లలో గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదని తెలిపారు. పదోన్నతులకు అర్హత కలిగిన అసోసియేట్‌ ప్రొఫెసర్ల జీవితాలను, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రొఫెసర్ల పదోన్నతుల్లో కూడా హైదరాబాద్‌లోని ఖాళీలు చూపించకుండా అక్రమ పద్ధతిలో బదిలీలు చేశారని విమర్శించారు.