ఆశీర్వదించండి ప్రజల కోసం ప్రశ్నిస్తా..

ఆశీర్వదించండి ప్రజల కోసం ప్రశ్నిస్తా..– ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది ఎర్ర జెండానే : భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌
– సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ
– మంచాల మండలంలో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-మంచాల
మతోన్మాద బీజేపీని, అవకాశవాద రాజకీయ శక్తులను ఓడించి, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించా లని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మతం, కులం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండు కోవాలని చూస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నాయకులు చేరడం, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ నాయకులు చేరి, వారి ఆస్తులను కాపాడుకునేందుకు చూస్తున్నారని విమర్శించారు.
భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎం.డీ జహంగీర్‌ మాట్లాడుతూ.. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి నేటి వరకు ప్రజల పక్షాన ఉండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసింది ఎర్రజెండానేనని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, దున్నే వాడికి భూమి కావాలని, కూలి రేట్లు పెంచాలని, రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర కావాలని పోరాటం చేసింది, చేస్తుంది కమ్యూనిస్టులేనని తెలిపారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే భువనగిరి ప్రాంత అభివృద్ధికి పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకను అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు, శ్రీరామ్‌ నాయక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు చంద్ర మోహన్‌, కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.జగన్‌, జి.నర్సింహ, మండల కార్యదర్శి నాగిళ్ళ శ్యామ్‌ సుందర్‌, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మార బుగ్గ రాములు, సిలి వేరు రాజు, మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల పార్టీ శాఖ కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.