సీపీఐ(ఎం)ను ఆశీర్వదించండి..

CPI(M) Bless..– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పొత్తుకు మేం వెంపర్లాడలేదు
– మా అభ్యర్థులను అసెంబ్లీకి పంపండి
– చట్టసభల్లో ప్రజావాణి వినిపించాలంటే కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉండాలి
– ఖమ్మంలో మా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలనుకున్న కాంగ్రెస్‌
– అనివార్య పరిస్థితుల్లోనే ఒంటరిగా 19 స్థానాల్లో పోటీ
– కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎదురుగాలి
– రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల వద్ద లేదు
– మీట్‌ ద ప్రెస్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను ఆశీర్వదించాలనీ, తమ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో ప్రజావాణి వినిపించాలంటే కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యముండాలని చెప్పారు. తమకు పదవులు ప్రధానం కాదనీ, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చెప్పే మాటలు కాదనీ, అవి అవలంభించే విధానాలనే చూస్తామని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక, పోరాడే శక్తులకు మద్దతు ఇస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’లో తమ్మినేని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు కె శ్రీనివాస్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె విరాహత్‌అలీ వేదికపైకి నాయకులకు స్వాగతం పలికారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలు సంపూర్ణంగా అభివృద్ధి కావాలన్న సమగ్ర ప్రణాళిక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల వద్ద లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ రెండు పార్టీలకు బూర్జువా, భూస్వామ్య విధానాలను అవలంభించే స్వభావముందని చెప్పారు. ఆ పార్టీలతో తాము ఎప్పుడూ పొత్తుకు వెంపర్లాడలేదని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా కలిసి పనిచేద్దామంటూ సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పోరాడుతున్నదని చెప్పారు. బీజేపీ అంబానీ, అదానీల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నదని చెప్పారు. దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీస్తున్నదనీ, దీంతో దేశం బ్రిటీష్‌ వారి పాలనలో కంటే వెనుకబడిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మనుధర్మం అమలు చేయాలని భావిస్తున్నదని విమర్శించారు. మోడీ పాలన దుర్మార్గంగా సాగుతున్నదని అన్నారు. బీజేపీని ఓడించేందుకే మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని వివరించారు. అప్పుడు బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌కు ఇప్పుడున్న పరిస్థితి ఉండేది కాదన్నారు. కమ్యూనిస్టుల వల్లే బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్న పరిస్థితి నుంచి బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారిందని అన్నారు. కర్నాటక ఫలితాలు, ఇతర కారణాలతో కాంగ్రెస్‌ పుంజుకుందన్నారు. కేసీఆర్‌ వైఖరి మారడానికి ఇదో కారణమన్నారు. బీజేపీ ప్రత్యర్థిగా ఉంటే కమ్యూనిస్టుల అవసరం ఉండేదనీ, ఆ పరిస్థితి ఇప్పుడు లేదనీ, ఇంకోవైపు బీజేపీకి భయపడే కమ్యూనిస్టులను కేసీఆర్‌ దూరం పెట్టారని అన్నారు.
కుట్రపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఠాక్రే తనకు స్వయంగా ఫోన్‌ చేసి ఈ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్నారని తమ్మినేని గుర్తు చేశారు. ఆ తర్వాత కుట్ర పూరితంగా ఆ పార్టీ వ్యవహరించిందని విమర్శించారు. ఖమ్మంలో సీపీఐ(ఎం) ఉనికినే ప్రశ్నార్ధకం చేయాలనుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు బలమున్న ఖమ్మం, నల్లగొండలో సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌కు సహకరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. భద్రాచలం, మధిర సిట్టింగ్‌ సీట్ల పేరుతో ఇవ్వలేదని చెప్పారు. భద్రాచలంలో పదిసార్లు ఎన్నికలైతే ఎనిమిదిసార్లు సీపీఐ(ఎం) గెలిచిందని గుర్తు చేశారు. ముందు పాలేరు ఇస్తామనీ, తర్వాత బలమైన నాయకుడు వచ్చాడు కాబట్టి ఇవ్వలేమన్నారని అన్నారు. అయినా కలిసి పనిచేయడం కోసం పాలేరునూ వదులుకున్నామని చెప్పారు. ఆ తర్వాత వైరా, మిర్యాలగూడ స్థానాలు ఇస్తామన్నారని వివరించారు. తీరా వైరా ఇవ్వలేమనీ, మిర్యాలగూడ ఒక్కటే ఇస్తామన్నారనీ, ఒక్క సీటుకే సీపీఐ కూడా అంగీకరించిందని అన్నారు. తాము బలంగా ఉన్న ఖమ్మంలో ఒక్క సీటూ ఇవ్వకుండా కాంగ్రెస్‌కు తమ ఓట్లు ఎలా వేయాలని ప్రశ్నించారు. ఇంకోవైపు కమ్యూనిస్టులతో పొత్తుంటే కాంగ్రెస్‌కు నష్టమంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. గెలిచాక చెరో ఎమ్మెల్సీ ఇస్తామనీ, సోనియాగాంధీతో మాట్లాడి అవసరమైతే మంత్రి పదవులిస్తామన్నారని చెప్పారు. 1996లో ప్రధాని పదవినే తృణప్రాయంగా వదిలేసిన వారమనీ, తమ ప్రాధాన్యత పదవులు కాదనీ, ప్రజలని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ వైఖరి వల్లే పొత్తులు విఫలమయ్యా యని విమర్శించారు. అనివార్య పరిస్థితుల్లోనే 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని వివరించారు. సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాల నీ, అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రజల గొంతును వినిపించాలంటే కమ్యూని స్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యముండాలని చెప్పారు. వామ పక్ష ఐక్యతలో భాగంగా కాంగ్రెస్‌తో పొత్తున్నా కొత్తగూడెంలో సీపీఐకి తాము మద్దతు ఇస్తున్నామని వివరించారు. ఇతర వామపక్షాలకు, బీఎస్పీ, పోరాడే శక్తులు, లౌకిక వాదులకు మద్దతిస్తామని అన్నారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు తమ్మినేని సమాధాన మిచ్చారు.బీఆర్‌ఎస్‌కు మేలు చేయడం కోసమే తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామన్న అభిప్రాయం తప్పు అని అన్నారు. బీఆర్‌ఎస్‌కు మేలు చేయడం కోసం పొత్తు కుదరకుండా కొందరు కాంగ్రెస్‌ నాయకులు చేసి ఉండొచ్చు కదా?అని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తున్నా ఖమ్మం స్థానంలో అది సాధ్యం కాలేదని అన్నారు. అయితే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం) పోటీ చేస్తే తాను గెలిచానని చెప్పారు. రేపు పాలేరులోనూ ఇదే జరగబోతుందన్నారు.