కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి

Bless the Congress– బీఆర్‌ఎస్‌ను గద్దె దించండి
– పసుపుకు మద్దతు ధర కల్పిస్తాం
– మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
– బీఆర్‌ఎస్‌ అవినీతిపై సీబీఐ, ఈడీ దాడులెందుకు లేవు..?
– బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే.. :కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ-మోర్తాడ్‌/ఆర్మూర్‌/ జగిత్యాల
”రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆశీర్వదించి గెలిపించాలి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు పంటకు మద్దతు ధర కల్పిస్తాం.. వరి ధాన్యానికి బోనస్‌ ఇస్తాం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బీఆర్‌ఎస్‌ పాలనలో దోచుకున్న ప్రజల సొమ్మును బయటకు తీస్తాం” అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.
టీపీసీసీ విజయభేరి బస్సు యాత్ర శుక్రవారం జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌, ఆర్మూర్‌లో సాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఆ డబ్బులను బయటకు తీసి ప్రజలకు అందించడానికి కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్‌లాగానే తెలంగాణలో సైతం ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా రూ.2500 ప్రతి మహిళకూ అందిస్తామన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్‌ సిలిండర్‌, ప్రతి కుటుంబానికీ 200 యూనిట్‌ల కరెంట్‌ ఉచితంగా ఇస్తామని చెప్పారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరతోపాటు పసుపుకూ మద్దతు ధర కల్పిస్తామని, ఎంఎస్‌పి కంటే అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇండ్లు లేని అందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు నిర్మిస్తామన్నారు. చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపా యల వృద్ధాప్య పింఛన్‌ అందిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించి కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. బాల్కొండలో సునీల్‌రెడ్డిని, ఆర్మూర్‌లో వినరుకుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరుస్తాం..
నిజాం చక్కెర ఫ్యాక్టరీని కేసీఆర్‌ ప్రభుత్వం మూసేసిందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. పసుపు మద్దతు ధర రూ.5 వేలకు పెంచుతామని, వరి ధాన్యానికి బోనస్‌ రూ.500 పెంచుతామని అన్నారు. గాంధీ కుటుంబానికి తెలంగాణతో ప్రత్యేక అనుబంధ ఉందని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే అని విమర్శించారు. బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే తనపై కేసులు పెట్టారని, పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయించారని, ఇల్లు లేకుండా చేశారని అన్నారు. కానీ దేశమే తన ఇల్లు అని చెప్పారు. కులగణన చేయాలని పార్లమెంట్‌లో ప్రధాని మోడీని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేకపోయారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తనపై 24 కేసులు నమోదు చేసిందని, అయినా భయపడేది లేదని, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలపై బీజేపీ.. సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తోందని విమర్శించారు.