– మరింత ఉత్సాహంగా పని చేస్తాం
– పదేండ్ల వైద్యారోగ్య ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి హరీశ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదేండ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు. తమను మళ్లీ ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో వైద్యారోగ్యశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆ శాఖ పదేండ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి నివేదికను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అన్ని స్థాయిల ఆస్పత్రుల్లో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇంతకాలం కోటీశ్వరులకే పరిమితమైన సేవలు త్వరలో పేదలకు కూడా అందనున్నాయని చెప్పారు. తొమ్మిదేండ్లలో 22,600 పోస్టులు భర్తీ చేయగా మరో 7291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ మూడో స్థానం నుంచి త్వరలో రెండో స్థానంలోకి చేరబోతున్నదని తెలిపారు.
ప్రగతి ఇదే
29 అంశాల్లో సాధించిన ప్రగతిని గణాంకాలతో మంత్రి ఆరోగ్య తెలంగాణ పదేండ్ల ప్రగతి నివేదిక పేరుతో విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం 2014లో తలసరి ఆరోగ్య బడ్జెట్ రూ.925 ఉండగా 2023కు రూ.3532 (నాలుగు రెట్లు) పెరిగింది. ఆరోగ్యసేవల అంచెలు మూడు నుంచి ఐదుకు, ఆస్పత్రి పడకలు 17 వేల నుంచి 34 వేలకు, ఆక్సిజన్ పడకలు 1,400 నుంచి 34 వేలకు పెరిగాయి. 2014లో ఒక్కటి కూడా లేని నియోనాటల్ అంబులెన్సులు 33, అమ్మఒడి వాహనాలు 300, పరమపద వాహనాలు 50 అందుబాటులో ఉన్నాయి. మాతా, శిశు మరణాలు 50 శాతం చొప్పున తగ్గాయి. నిటిఅయోగ్ ఆరోగ్య సూచిక ర్యాంకు 11 నుంచి మూడుకు పెరిగింది.