మీలో ఒకడినై వస్తున్న ఆశీర్వదించండి: చామల

– పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లందిస్తా
– మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని
– భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ – బొమ్మలరామారం
భువనగిరి పార్లమెంట్ అభివృద్ధే తన లక్ష్యమని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తనకు ఒక్క అవకాశం కల్పించాలని, ఎమ్మెల్యేలకు తోడుగా ఉండి కేంద్రం నుంచి రావలసిన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పిలుపునిచ్చారు. ఒక్కసారి ఆశీర్వదించి తనను గెలిపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తానని చెప్పారు.
ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సామాన్య వ్యక్తినన్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు పార్లమెంట్ నుండి పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కేసీఆర్‌ను ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.‌ బీజేపీ కులం, మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, మళ్ళీ వాళ్లకు ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని అమ్మ సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దండుకున్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఆ మొత్తాన్ని రాబడి పంచాలన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలంతా ఆశీర్వదించి గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ ర్యాలీలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మహిళా సంక్షేమ కార్పొరేషన్ శోభరాణి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మధు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.