అందుబాటులో ఉండి సేవ చేశాను.. ఆశీర్వదించండి

–  ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్
 నవతెలంగాణ- రామారెడ్డి:  గత ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎన్నికలు, రెండు సంవత్సరాలు కరోనా పోయిన మిగతా రెండు సంవత్సరాల్లో అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేశానని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ శుక్రవారం ప్రజలను కోరారు. మండలంలోని కన్నాపూర్ తాండ, కన్నాపూర్, గొల్లపల్లి, రంగంపేట, మోషన్ పూర్ తో పాటు ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి చేసిందన్నారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. మదన్ మోహన్ రావు పంపిణీ చేసిన నకిలీ బిందెల లాగే పరిపాలన ఉంటుందని, కళ్యాణ లక్ష్మి తో పంపిణీ చేసిన నాణ్యమైన చీరల్లా మా పరిపాలన ఉంటుందన్నారు. గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలను అవమాన పరుస్తూ, పట్టించుకోకుండా కడప, కర్నూల్ నుండి మనుషులతో ప్రచారం నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. అది చేస్తాం ఇది చేస్తామని గంగిరెద్దులా డబ్బు సంచులు పట్టుకొని వస్తారని తీసుకొని కారుకు ఓటేయాలని సూచించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఫెయిల్ అయ్యాయని, మూడు, నాలుగు గంటల కరెంటు ఇచ్చే ప్రభుత్వం కావాలా, 24 గంటలు ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం కావాలా ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ఆయన కరీంనగర్ నుండి వచ్చారని, స్థానికులుగా సేవ చేసే వారిని గుర్తించాలని అన్నారు. కన్నాపూర్ బ్రిడ్జి నిర్మాణం మంజూర అయిందని, కన్నాపూర్ నుండి రామారెడ్డి రోడ్డును అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ రవీందర్రావు, నాయకులు చందర్, రాజనర్సు, పాల మల్లే, సంజీవ్, నారాయణరెడ్డి, పడిగెల శ్రీనివాస్, ఉమాదేవి దత్తాత్రే, తదితరులు పాల్గొన్నారు.