
– బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
– మండలంలో విస్తృత ప్రచారం
నవతెలంగాణ -తాడ్వాయి
మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఈ ప్రాంత రుణం తీర్చుకుంటా, మీ ఆశీర్వాదాలు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాయి, మరోసారి ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపిస్తే, అభివృద్ధి ఏంటో చూపిస్తా అని బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడి నాగజ్యోతి అన్నారు. సోమవారం మండలంలోని కొండపర్తి, లవ్వాల, కామారం, కాల్వపెళ్లి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ జడ్పిటిసిగా గెలిపించి ఆశీర్వదించడం వల్ల, ఈ ప్రాంతంలో కొంత మేరకు అభివృద్ధి చేయగలిగానని, ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే.. వేగంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత రుణం తీర్చుకుంటానని అన్నారు. మూడోసారి అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ పార్టీ అని, అధికార పార్టీతోనే ఉంటేనే ములుగు నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రాంతానికి పోడు పట్టాలు ఇప్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. గిరిజనేతరులు కూడా పోడు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అసైన్డ్ భూము లపై పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అందరికీ వివరించారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ వారు, ఆరు గ్యారెంటీలు ఎలా ఇస్తారని నాగజ్యోతి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకోగలిగామని కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంటు ఇస్తామంటున్నారని, 24 గంటల కరెంటు కావాలా మూడు గంటల కరెంటు కావాలా ప్రజలే తెలుసుకోవాలన్నారు ఈనెల 30వ తారీకు తేదీన జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.