– ఎర్ర తెగులు బారిన పైరు
– ఎండిపోతున్న మొక్కలు
– పంట మార్పిడి చేయకపోవడమే కారణమంటున్న అధికారులు
విత్తనం వేసింది మొదలుకొని పంట చేతికి వచ్చేదాకా రైతన్న పడని కష్టం లేదు. మొదట్లో వర్షం కోసం ఎదురుచూడటం, విత్తనం నాటిన తర్వాత మొలకెత్తేందుకు తగినంత నీటి కోసం.. ఆ తరువాత తెగుళ్ల బెంగ.. పంట చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధర కోసం పోరాడాలి. ఇలా రైతు నిరంతరం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతేడాది పత్తికి ధర లేక రైతులు ఇప్పటికీ ఇండ్లల్లోనే నిల్వ చేసుకున్న రైతులు ఉన్నారు. ఈసారి వేసిన పైరును తెగుళ్లు వెంటాడుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది మే చివరి వారంలో వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నలు పొలం పనులు పూర్తిచేసుకుని జూన్ రెండో వారంకల్లా విత్తనాలు వేశారు. విత్తనం వేసిన తర్వాత వర్షాలు లేక నానా తంటాలు పడి పైరును కాపాడుకున్నారు. రెండు మూడు సార్లు విత్తనాలు వేసి ఎకరాకు 20వేలకు పైగా పెట్టుబడి అదనంగా పెట్టారు. స్పిక్లర్ల్ల ద్వారా నీటిని పెట్టి పత్తి చేనును కాపాడుకున్నారు. ఎన్ని చేసినా చివరకు రైతుకు పత్తి పంట నిరాశనే మిగిల్చింది. పూత కాత దశలో ఎర్ర తెగులు చుట్టుముట్టింది. పూత, కాయలు రాలిపోతున్నాయి. వ్యవసాయ అధికారులను అడిగితే.. వేసిన పంట వేయొద్దని.. పంట మార్పిడి చేయాలని చెబుతున్నారు. అయితే, రెండు మూడు సంవత్సరాలు పడావు ఉన్న భూమిలో వేసిన పంట సైతం ఎండు తెగులుకు గురైంది. రైతులు ఎకరాకు రూ.40వేలకు పైగా ఖర్చు చేశారు. పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనబడటం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 8.50 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. నాగర్‌కర్నూల్ 3.50 ఎకరాల లక్షల ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో లక్ష ఎకరాలు, నారాయణపేటలో 1.75 లక్షలు, వనపర్తిలో 75వేల ఎకరాలు, గద్వాలలో లక్షన్నర ఎకరాలు సాగు చేశారు. గద్వాలలో 50వేల ఎకరాలకు పైగా విత్తన పత్తి సాగు చేస్తారు. ఈ పైరును ఎర్ర తెగులు పీడిస్తోంది. ఇది అధిక వర్షాలతో వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువనే నమోదైంది. అత్యంత సారవంతమైన నల్ల రేగడి, ఎర్ర భూముల్లో సాగుచేసిన పత్తి పంటలకు సైతం ఎర్ర తెగులు రావడం ఆందోళన కలిగించే విషయం. తెలకపల్లి మండల పరిధిలో పెద్దూరు, బొప్పెల్లి, ఆలేరు, ఒట్టిపెళ్లి, కమ్మరెడ్డిపల్లి, తెలకపల్లి, మరికల్, నడిగడ్డ, తాళ్లపల్లి, కారువంగా తదితర ప్రాంతాల్లో పత్తి పంటను అధికంగా సాగు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం తెలకపల్లి మండలంలో 25 వేల ఎకరాలకుపైగా పత్తి సాగైంది. ఇదే మండలం నడిగడ్డ గ్రామంలో 2800 ఎకరాల సాగు భూమి ఉంది. 850 ఎకరాలపైగా పత్తి పంటను సాగవుతుంది. బర్ల సురేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి గోవర్ధన్ రెడ్డి, సాగుచేసిన 15 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. సుమారు ఐదు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే ముందు ఎర్ర తెగులు రావడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లాలో 80శాతం పంటల పరిస్థితి ఇలాగే ఉంది. జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
ఫంగల్ డిసీజ్ వల్లనే..
ఖరీఫ్‌లో పంటకు ఫంగల్ డిసీజ్ సోకింది. పత్తి పంటపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. శిలీంద్రం ప్రభావం చేత ఆకులు ఎర్రబడతాయి. ఒక ప్రాంతంలో వేసిన పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. ఈ తెగులు సోకితే ట్రైకో ధర్మ పౌడరుని నీళ్లలో కలిపి చెట్టు మొదల్లో పోయాలి. దీంతో కాస్త పంటకు మేలు కలుగుతుంది.
– వెంకటేశ్వర్లు, జేడీఏ -మహబూబ్‌నగర్
పత్తి రైతులను
ప్రభుత్వం ఆదుకోవాలి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పత్తికి ఎర్ర తెగులు వచ్చి పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.
ఏ రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్
పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు
ఆరుగాలం కష్టం చేసి వేసిన పత్తి పైరుకు ఎర్ర తెగులు సోకింది. ఎకరాకు రూ.40 వేల పైగా పెట్టుబడి అయింది. లాభం రాకపోయినా అప్పులు తీరితే బాగుండేది. వర్షాలు లేకపోయినా పంటలు కాపాడుకున్నాం. అయినా ఎర్ర తెగులు మమ్మల్ని ముంచింది.
– రైతు లక్ష్మారెడ్డి, నడిగడ్డ.