– గాజా స్కూల్లో 30మంది సామూహిక సమాధి
– ధ్వంసమవుతున్న ఆరోగ్య వ్యవస్థ
– పది రోజులుగా అల్ అమల్ ఆస్పత్రిపై దాడులు
గాజా : ఉత్తర గాజాలో సామూహిక సమాధిని కనుగొన్నారు. కళ్ళకు గంతలు కట్టి, చేతులు వెనక్కి కట్టేసి మరీ 30మంది పౌరులను ఇజ్రాయిల్ బలగాలు ఉరి తీసినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఉత్తర గాజాల్లో ఒక స్కూల్ వెనుక భాగంలోఈ మృత దేహాలను పడేసి వుండగా చూసి గుర్తించిన వారితో మీడియా మాట్లాడింది. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా, స్కూల్లో పెద్ద ఎత్తున రాళ్ళకుప్ప కనిపించిందని, వెంటనే అక్కడకు వెళ్ళిచూడగా దాని అడుగున డజన్ల సంఖ్యలో మృత దేహాలు పడి వున్నాయని వారు తెలిపారు. మృతదేహాలను చుట్టి వుంచిన నల్ల ప్లాస్టిక్ బ్యాగ్‌లను తెరవగానే అవన్నీ కుళ్లిపోయి దుర్వాసన వస్తోందన్నారు. పైగా కాళ్ళు, చేతులకు ప్లాస్టిక్ సంకెళ్ళు వేసి, కళ్లకు, తలకి బట్టతో గట్టిగా కట్టేసి వున్నాయని వారు చెప్పారు.
బెయిట్ లాహియాలో జరిగిన ఈ ఘటనను హమస్ తీవ్రంగా ఖండించింది. ఈ దారుణమైన నేరాన్ని వెంటనే డాక్యుమెంట్‌గా భద్రపరచాల్సిందిగా మానవ హక్కుల సంస్థలను హమస్ మీడియా కార్యాలయం కోరింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్‌ను ఏమాత్రమూ పట్టించుకోకుండా పాలస్తీనియన్లను నిర్మూలించాలనే అంతిమ లక్ష్యంతో ఇజ్రాయిల్ ఈ దాడులకు తెగబడుతోందని విమర్శిస్తూ టెలిగ్రామ్‌లో పోస్టు చేసింది.
అల్ అమల్ ఆస్పత్రి వెనుక భాగంలో 45రోజుల శిశువు, 75ఏళ్ళ వృద్ధురాలు మృతదేహాలను ఖననం చేస్తున్న వీడియోను పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీ విడుదల చేసింది. ఆస్పత్రిలో రోజుల తరబడి ఆక్సిజన్ లేకపోవడంతో వారు మరణించారని తెలిపింది. అల్ అమల్ ఆస్పత్రిపై ఇప్పటికి 10 రోజుల నుండి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో గాజాలో ఆరోగ్య కేంద్రాలను, మొత్తంగా ఆరోగ్య వ్యవస్థను ధ్వంసం చేయడానికే ఇజ్రాయిల్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అల్ షిఫా ఆస్పత్రితో మొదలుపెట్టి ఇండోనేషియా ఆస్పత్రి, నాజర్ ఆస్పత్రి, తాజాగా ఖాన్ యూనిస్‌లోని అల్ అమల్ ఆస్పత్రి వరకు అన్నీ నేలమట్టమవుతున్నాయి. ఇజ్రాయిల్ ట్యాంకులు ఇప్పటికే చుట్టుముట్టి వున్నాయి. పైగా అటాక్ డ్రోన్‌లతో, భారీ మెషిన్ గన్‌లతో కూడా కాల్పులు సాగుతున్నాయి. ఆస్పత్రి కాంపౌండ్‌లో కదులుతున్న ప్రతి వాహనం, వ్యక్తినీ కాల్చేస్తున్నారు.
ఇప్పటికే ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి.
గాజాలోని ప్రజలకు సాయమందించేందుకు జరుగు తున్న ప్రయత్నాలను కాపాడుకోవాల్సి వుందని, సాయమందే లా చూడాల్సి వుందని యురోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి శరణార్దుల సంస్థ చర్యలపై ఇజ్రాయిల్ బలగాలు ఆరోపణలు చేసినప్పటికీ మనం వాటిని పట్టించుకోరాదని, వాటివల్ల ఈ మానవతా చర్యలు ఆగరాదని కోరారు. ఇదిలావుండగా, మంగళవారం ఇజ్రాయిల్ బలగాలు ఒక ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ముసుగులో వచ్చి ముగ్గురు పాలస్తీనియన్లను చంపడాన్ని ఇజ్రాయిల్ మానవ హక్కుల గ్రూపు తీవ్రంగా ఖండించింది. ఫిజీషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. బందీల కుటుంబాల నుండి, అంత ర్జాతీయ సమాజం నుండి తీవ్రంగా ఒత్తిడి వస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన మొండిపట్టు వీడడం లేదు. గాజాలో దాడులు కొనసాగిస్తామని ప్రకటన లు చేస్తున్నారు.