స్కామ్‌ను అడ్డుకోండి

Block the scam– టెలి మెడిసిన్‌ పేరుతో బోగస్‌ కంపెనీలకు..కోట్ల రూపాయల చెల్లింపులు ఆపాలి
– ఉన్నతాధికారులు చేస్తున్న దందాపై విచారణ చేపట్టాలి : సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌
ఈఎస్‌ఐలో కొనసాగుతున్న స్కామ్‌ను అడ్డుకోవాలని, టెలి మెడిసిన్‌ పేరుతో బోగస్‌ కంపెనీలకు కోట్ల రూపాయల చెల్లింపులు ఆపాలని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ గోల్కొండ క్రాస్‌ రోడ్డులోని సీపీఐ(ఎం) నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో మందులు, ల్యాబ్‌ కిట్స్‌ కొనుగోళ్లలో జరిగిన రూ. వందలకోట్ల కుంభకోణంపై విచారణ సందర్భంగానే టెలి మెడిసిన్‌ పేరుతో భారీ స్కాం జరుగుతోందని ఫిర్యాదు చేసినప్పటికీ అవినీతి నిరోధక శాఖ పెడచెవిన పెట్టిందన్నారు. టెలి మెడిసిన్‌, ఈసీజీల పేరుతో ఎలాంటి పనులు చేయకపోయినా రెండు కంపెనీలు (నానో రే మెడికల్‌ టెక్నాలజీ ప్రయివేట్‌ లిమిటెడ్‌, వీఆర్‌ టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌) సేవలు అందించామని కోట్లాది రూపాయల నేరం చేశాయన్నారు. నానో రే సంస్థకు చాటుమాటుగా గతేడాది ఐఎంఎస్‌ డైరెక్టరేట్‌ రూ. 10 కోట్లు చెల్లించిందని తెలిపారు. అలాగే వీఆర్‌ టెలి హెల్త్‌ సర్వీసెస్‌కు మరో రూ.10 కోట్లు చెల్లించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తూ సంతకాలు చేయాలని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఇన్‌చార్జి, మెడికల్‌ ఆఫీసర్‌ (ఐఎంఓ)లపై ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వీఆర్‌ టెలిహెల్త్‌కు చెల్లింపుల కోసం సంతకాలు చేయాలని ఓ ఐఏఎస్‌ అధికారిణి అండదండలతో ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ హౌదా కలిగిన వ్యక్తి, ఒక ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఈ స్కామ్‌ను ముందుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. టెలిమెడిసిన్‌ పేరుతో కోట్లాది రూపాయలు చెల్లింపులతో పాటు ఈఎస్‌ఐ, స్కామ్‌కు పాల్పడిన డ్రగ్‌ కంపెనీలకు కూడా చెల్లింపులు చేయడానికి ఈ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఈ స్కాంపై వెంటనే విచారణ జరపాలని, అక్రమ చెల్లింపులకు పాల్పడిన అధికారులను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ ముషీరాబాద్‌ నాయకులు దశరథ్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.