బ్లాక్‌బస్టర్‌ ఖాయం

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి ఘన విజయాల తర్వాత యువ కథానాయకుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల కలయికలో వస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన ఈ ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌లో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించారు. టీజీ విశ్వ ప్రసాద్‌, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ను ఘనంగా నిర్వహించింది. యువ హీరో అడివి శేష్‌, నిర్మాతలు అశ్వినీదత్‌, సునీల్‌ నారంగ్‌, రవి శంకర్‌, దామోదర ప్రసాద్‌, కోన వెంకట్‌, దర్శకులు బాబీ కొల్లి, మారుతి, నందిని రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. అతిరథమహారథుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.
‘విద్యాసాగర్‌కి, వివేక్‌కి, విశ్వప్రసాద్‌గారికి, కళ్యాణి మాలిక్‌కి, భాస్కరభట్ల, లక్ష్మీభూపాల, ఎడిటర్‌ కిరణ్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఎమోషన్‌ పండించగల నటి కావాలి. ఈ కథ చెప్పినప్పుడు మాళవిక స్పందన చూసే పూర్తి నమ్మకం వచ్చేసింది. నాగశౌర్య అద్భుతమైన నటుడు. 1960 నాటి నాకిష్టమైన పాటను ఇందులో రీమిక్స్‌ చేశాం. ఆ పాటను ఆలపించిన నా మొదటి దర్శకుడు మోహనకష్ణ ఇంద్రగంటికి ప్రత్యేక కృతజ్ఞతలు. సునీల్‌ నామా ఈ కథను సరిగ్గా అర్థం చేసుకొని సినిమాకి అవసరమైన సినిమాటోగ్రఫీని అందించారు’ అని దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల చెప్పారు.
‘మంచి సినిమాలో నటించే అవకాశం లభించడం అదృష్టం’ అని నాయిక మాళవిక నాయర్‌ చెప్పారు. నిర్మాత దాసరి పద్మజ మాట్లాడుతూ,’ మంచి సినిమాలో భాగమయ్యే అవకాశమిచ్చిన విశ్వ ప్రసాద్‌కి, వివేక్‌కి ధన్యవాదాలు. శ్రీనివాస్‌, నాగశౌర్య సినిమాలు ఎంతో బాగుంటాయి. ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనేది మనం తరచూ ఉపయోగించే మాట. ఈ సినిమా విడుదలయాక ఫలానా శౌర్య, ఫలానా శ్రీనివాస్‌, ఫలానా మాళవిక అంటారు. శ్రీనివాస్‌ డైరెక్షన్‌, డైలాగ్స్‌ అంటే చాలామందికి ఇష్టం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. నేను, మాళవిక పెద్ద హిట్‌ కొట్టబోతున్నాం. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అని చెప్పను కానీ.. ఈ సినిమాతో మీ మనస్సులో మేము కుర్చీలు వేసుకుని కూర్చుంటాం. దీని తర్వాత ఎన్ని ప్లాప్‌లు తీసినా మమ్మల్ని క్షమిస్తారు. అంత మంచి సినిమా.
– హీరో నాగశౌర్య