బ్లడ్‌ క్యాన్సర్‌ నయమవుతుందని..

– గడ్డకట్టే చలిలో గంగా నది స్నానం
– ప్రాణాలు కోల్పోయిన ఐదేండ్ల బాలుడు
– ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఘటన
చండీగఢ్‌: ప్రపంచంలో శాస్త్రసాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కి అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వైద్యపరంగా అనేక రోగాలకూ పరిష్కారాలు దొరుకుతున్నాయి. కానీ, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందుకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చోటు చేసుకున్న ఒక ఘటనే తార్కాణం. ఐదేండ్ల బాలుడికి గంగా నదిలో స్నానం చేస్తే అతనికి ఉన్న బ్లడ్‌ క్యాన్సర్‌ నయమవుతుందన్న తల్లిదండ్రుల మూఢనమ్మకం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఎముకలు కొరికే చలిలో బాలుడిని గంగా నదిలో స్నానం కోసమని తీసుకెళ్లారు. ప్రార్థనలు చేస్తూ గంగా నదిలో బాలుడిని ముంచారు. నీటి లోపల చాలా సమయం పాటు అలాగే ఉంచారు. చలికి తట్టుకోలేక బాలుడు తీవ్ర నరకయాతనను అనుభవించాడు. చుట్టుపక్కల ఉండేవారు అది గమనించి బాలుడి మునకను ఆపాలని బాలుడి కుటుంబీకులను అడిగారు. అయినప్పటికీ, వారు ఎంతకూ వినకపోవటంతో అక్కడ ఉన్నవారు బాలుడిని గంగా నదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. బాలుడి పరిస్థితి విషమించింది. అది గమనించిన అక్కడి వారు బాలుడిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు.అయితే, బాలుడు అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీలో నివసించే బాధిత కుటుంబం ఈ పని కోసం హరిద్వార్‌కు వచ్చింది. గంగా నది స్నానం సమయంలో బాలుడితో తల్లిదండ్రులతో పాటు ఒక మహిళ సైతం ఉన్నది. బాలుడిని గంగా నదిలో స్నానం చేయించిన ఘటనకు సంబంధించిన వీడియోలో జరిగిన తతంగమంతా వెల్లడైంది. ఈ ఘటన తర్వాత పోలీసులు బాలుడి తల్లిదండ్రులు, ఒక మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.