ఎగిసిపడిన అలల అక్షరాలు

ఎన్‌ లహరి రచించిన నానీల పుస్తకం ‘నానీల తీరాన’ ఎగిసిపడ్డ ఎన్నో ఆణిముత్యాలు ఏరి చదివి తడిసి ముద్దయ్యాను. గంటన్నరసేపు విడిచిపెట్టక పట్టువదలక అలా చదివించింది ఈ పుస్తకం. మదిలో ఆలోచనలను దించింది. అనుభవాలను రంగరించి, ఆత్మీయతను మూటగట్టి, అనుబంధాలను వడబోసి రచించినటువంటి నానీలు ఎంతో ఘాటుగా ఉన్నాయి. ప్రేమను వర్షించాయి. మట్టి పరిమళాన్ని విరజల్లాయి. అమ్మతనాన్ని స్పృశించాయి. ఊరు వాతావరణాన్ని ప్రతిబింబించాయి. గురువును స్మరించింది. తోడును పెంచింది. ప్రతి ఒక్క నాని అద్భుతం, అమోఘం. రచయిత జ్ఞానానికి నిదర్శనం.
”అందమెంతున్న/ ఏమిటి ప్రయోజనం/ బుద్ధి మాత్రం/ బురదలో ఉన్నప్పుడు”.. అందం బాహ్య సౌందర్యం అయినప్పటికీ మనో సౌందర్యానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చినా, చూడడానికి అందంగా ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? బుద్ధి చక్కగా లేకపోతే అని ప్రశ్నిస్తుంది కవయిత్రి.
మహిళలకు కూడా ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన గొప్ప నానీ. ఉదాహరణకు… ”గులాబీని/ చూసి నేర్చుకో/ ఓ మహిళ చుట్టూ/ ఓ ముళ్ళకంచె కూర్చుకో” చూడండి. ఎంత చక్కగా ఉందో!! అంటే ఎవరికి వాళ్లే ధైర్యం తెచ్చుకోవాలి. సమస్యను పరిష్కరించుకోవాలి. ఇంకో నానీ… ”అపార్థం ఓ/ నిప్పురవ్వ/ కార్చిచ్చులా/ జీవనవనాన్ని దహిస్తుంది”
ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామం. అదే భార్యాభర్తలకు గాని, అన్నదమ్ములకు గాని, స్నేహితులకు గాని ఉండేటటువంటి అపార్థం వల్ల అనురాగం మందగించి అనుబంధాలే దూరమవుతాయి.
”అన్నదాతలకు/ ఆకలి కేకలు/ పాలకులకేమో/ ఓట్ల పొలికేకలు” రైతుల పక్షాన నిలబడి నినదీస్తున్న నాని ఇది. ఇలా నానీలు ఎంతో గాఢతతో చిక్కగా ఉన్నాయి.
లహరి అంటే తరంగం. నానీల అలల అక్షరాలు ఎగిసెగిసిపడ్డాయి. మంచి నానీల కావ్యం అందించినందుకు హృదయపూర్వక అభినందనలు. ఇలాగే ఇంకా ముందు ముందు చక్కని రచనలు చేయాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ.
డా|| చీదెళ్ళ సీతాలక్ష్మి, 9490367383