– సర్వేనెంబర్ 584 ఎక్స్ టెంట్ మూడు ఎకరాల 11 గుంటలు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ శివారులో గల సర్వే నంబర్ 584 దీని విస్తీర్ణం మూడు ఎకరాల 11 గుంటలు. ఈ భూమి ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వ ఇండ్ల స్థలాల భూమిగా రికార్డుల్లో ఉంది. ఈ భూమి ఒక వ్యక్తి ఆక్రమించుకోగా, ఆ వ్యక్తితో సంబంధిత శాఖ రెవెన్యూ అధికారులు కుమ్మక్కై బై నంబర్ ఇస్తూ అక్రమార్కునికి అండగా నిలుస్తున్నారంటూ ఆరోపిస్తూ సోమవారం నాడు బహుజన్ లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుక్కల్ ఇంచార్జ్ కర్రే వార్ నాగేష్ ఆధ్వర్యంలో పలువురు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాహసీల్దార్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ భూమి పట్ల ఏళ్ల తరబడి ఆందోళనలు చేపడుతున్నప్పటికీ, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వ ఇండ్ల స్థలాల భూమి అక్రమార్కుడు పట్టా భూమిగా మార్చుకునేందుకు పైరవీలు చేస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ భూమి అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలుగా కేటాయించాలని తాహసీల్దారుకు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమి అక్రమార్కులు కబ్జాలు చేస్తుంటే, అధికారులు అలాంటి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. 584 సర్వే నెంబర్ విస్తీర్ణం మూడు ఎకరాల 11 గుంటల భూమిని వెంటనే స్వాధీనం పరచుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష, ఆందోళన చేపడుతామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం ఇన్చార్జిగా వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ రాచప్ప కు అందజేశారు. ఈ వినతిపత్రం కార్యక్రమంలో బీఎల్ పీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.