ఏటి వారనే తిరుగుతుండు ఇంటి ముఖమే లేదు
మందు పెట్టిండ్రో మాకు పెట్టిండ్రో మన సోయినే లేడు
చెట్టు అంటాడు పుట్ట అంటాడు వెన్నెలంటాడు ఏరంటాడు
పచ్చి అంటే ప్రాణం అంటాడు
తాళ్ల దిక్కు చూసినట్టు తాళి దిక్కు చూస్తలేడని
చుట్టుపక్కలొళ్ళ తోటి ఇంటిది వాపోతుందంట నీలి
వలలు తీసుకుపోయి వలలో పడ్డానంట
వలపు తప్పా నీలి
మంచు కురిసేటప్పుడు వచ్చి
వెన్నెల వచ్చి పోయేదాకా నీ జాసే కదా నీలి
నీవు నిలబడ్డతలానా నీల్లార పోస్తే…
పూర్వం పూనకంలా వచ్చింది
తావు తావుకు పానమొంచిన నీడలే
గాలి చెవులకు దూరి ఏదో చెబుతుంది
ఆకాశం మెల్లగా కిందికి దిగుతున్నట్టు అనిపించింది
దరి మీద దాగుడుమూతలు
అడుగు తీసి అడుగెయ్యకుండానే ఆత్మ అల్లుకుపోతుంటే
కయాలు తప్పినట్టుందే నీ కాంతికి ఆకలి దూపలు కాని తలమిది
పొరబోతున్న రాగం
దమ్మన గొయ్యలో దాగున్న ఊపిరి
దేవి గాడు దేవునోలే ఉన్నాడు
ఉచ్ఛ్వాస నిచ్వాసలో మార్మిక రాగం ఒకటి
లయగా పాడుతుంది ఇది వీణలు మీటే విడిది
పొదలల్ల నుంచి పొరబోయేది ఉరుకుతుంది
ఎండకు వానకు చెట్లు గొడుగులై రమ్మంటున్నాయి
నా అంతరం ఆకుపచ్చగా ఇగిరేస్తుంది
ఎద కరిగిన ఉచ్చారణే దివ్య భాష
నీటి చెంపల మీద తెడ కన్న కల కన్నీటి ధార
ఏరు కట్టుకున్న వెన్నెల చీరకు ఒడ్డు వడ్డాణమైందే నీలి
లోన పున్నమి పులుముతుంటే కళ్ళల్లో కాంతి ఈనుతుంది
పడె చుట్టూ పిట్టల బంతి
ఆ పక్కన పిడిప్పని వల బుద్దునోలే ఉంది
ఏటి మధ్య నుంచి దీపం ఒకటి ఒడ్డుకొస్తుంది
తుమ్మెదలు వాలి పువ్వులు, పక్షులు వాలి చెట్లు దివ్యమైనాయి కదా
వెయ్యిన్నొక్క మిణుగురుల మధ్య మేమందరము నత్యంలో ఉన్నాం
ఈ వేడుకలో ఏ చాప నన్ను చూసి భయపడలే
విశ్వమంతా పూల తోటలు కావాలని
ఇక్కడే తుమ్మెదలు తపస్సు చేస్తున్నాయి
జాసను పెన వేసుకుని వెన్నెల ఎన్ని రూపులు కట్టిందో
నిందలు ఎన్నైనా రాని పొగ గొట్టాల మధ్య నేను వికసించలేను
ఇన్ని వెలుగులను వదిలి నేనెక్కడికి పోనే నీలి!
– మునాసు వెంకట్, 9948158163