ఎంవీ యాక్టు సవరణ బిల్లును తగులబెట్టిన బీఎంఎస్‌

ఎంవీ యాక్టు సవరణ బిల్లును తగులబెట్టిన బీఎంఎస్‌– కేంద్రం వెనక్కి తీసుకోకపోతే ఈనెల 25 తర్వాత దేశవ్యాప్త సమ్మె
–  డ్రైవర్లకు పదేండ్ల జైలు, రూ.7 లక్షల జరిమానా సరిగాదు
–  బీపీటీఎమ్‌ఎమ్‌(బీఎంఎస్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంవీ యాక్టు సవరణ బిల్లును ఆ పార్టీ అనుబంధ సంఘమే తగులబెట్టింది. డ్రైవర్లకు పదేండ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా సరిగాదని సూచించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో భారతీయ ప్రయివేటు ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహాసంఫ్‌ు(బీఎంఎస్‌ అనుబంధం) ఆధ్వర్యంలో ఎంవీ యాక్టు సవరణ బిల్లును డ్రైవర్లు తగులబెట్టిరు. ఈ సందర్భంగా బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్‌ మాట్లాడుతూ.. న్యాయ సంహిత బిల్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈ నెల 25 తరువాత దేశ వ్యాప్తంగా రవాణా సమ్మె చేస్తామని హెచ్చరించారు. న్యాయ సంహితలో పేర్కొన్న విధంగా ఏదైనా డ్రైవర్‌ యాక్సిడెంట్‌ చేసిన తరువాత తప్పించుకుంటే డ్రైవర్‌కు పదేండ్ల జైలు, ఏడు లక్షల రూపాయల జరిమానా విధించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఐఆర్‌డీఏ పెంచిన ప్రయివేటు రవాణా వాహనాల ఇన్సూరెన్స్‌ను వెంటనే 50 శాతం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రవాణా వాహనాలకు వివిధ రకాలుగా ఉన్న టాక్స్‌ను ఒకే దేశం-ఒకే పన్ను విధానాన్ని తేవాలని కోరారు. డ్రైవర్లకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, ప్రమాద, సహజ మరణ బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారులపై డ్రైవర్ల కోసం విశ్రాంతి గృహాలు, సబ్సిడీ క్యాంటీన్లు, ప్రాథమిక వైద్యశాలలు నిర్మాణం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ స్టేట్‌ ప్రయివేటు ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహా సంఫ్‌ు ఉపాధ్యక్షులు హాబీబ్‌, శంకర్‌, మినీగూడ్స్‌ వెహికిల్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాస్‌ ముదిరాజ్‌, జహంగీర్‌, మనోజ్‌ ఆటో యూనియన్‌ నాయకులు పెంటయ్య, నంద కిషోర్‌, కిషన్‌, రాములు ,మహేష్‌ రంగ తదితరులు పాల్గొన్నారు.