నవతెలంగాణ – బిజినెస్ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర పోలిస్ డిపార్ట్‌మెంట్‌తో ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి ”బరోడా పోలీస్ సాలరీ ప్యాకేజీని” అందించడానికి గురువారం అవగాహన ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి ఉచిత సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ (పిఎఐ), యోధా రిటైల్ లోన్లపై ప్రత్యేక ఆఫర్లు, డెబిట్, క్రెడిట్ కార్డ్ సేవలతో పాటు అనేక ప్రత్యేక ప్రయోజనాలను బ్యాంకు అందచేయనుంది. వాటిలో ముఖ్యంగా, ఖాతాదారు విధి నిర్వహణ సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.05 కోట్ల వరకు, విధినిర్వహణేతర సమయంలో మరణిస్తే రూ.90 లక్షల వరకు, శాశ్వత వైకల్యంపై రూ.60 లక్షల వరకు, పాక్షిక వైకల్యంపై రూ.30 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమాను అందించనుంది. డిజిపి అంజనీకుమార్ ఆధ్వర్యంలో పోలీసుల శాఖ తరపున ఎడిజిపి భిలాష బిష్త్, బిఒబి తరుపున రితేష్ కుమార్ ఒప్పందాలను మార్చుకున్నారు.
పోలీస్ శాఖతో బిఒబి ఒప్పందం
1:26 am