హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 87.7 శాతం వృద్థితో రూ.4,070 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయంతో పాటు వడ్డీయేతర ఆదాయంలో పెరుగుదల బీఓబీ మెరుగైన ఆర్థిక ఫలితాలకు ప్రధాన మద్దతును అందించాయి. గతేడాది ఇదే క్యూ1లో రూ.2,168.1 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.20,119.52 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ1లో 48.50 శాతం వృద్థితో రూ.29,878.07 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 24.4 శాతం వృద్థితో రూ.10,997 కోట్లుగా నమోదయ్యింది. వడ్డీయేతర ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ.3,322 కోట్లుగా చోటు చేసుకుంది. గడిచిన జూన్ త్రైమాసికంలో బీఓబీ మొండి బాకీల కోసం రూ.1,693 కోట్ల కేటాయింపులు చేయగా.. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,560 కోట్ల కేటాయింపులు జరిపింది.