బోడుప్పల్‌ పెద్దకంచె ల్యాండ్‌ పూలింగ్‌ను అడ్డుకోవద్దు

– మా భవిష్యత్‌ తరాల కోసమే
– ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇస్తున్నాం
– అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన తెలిపిన రైతులు
నవతెలంగాణ-బోడుప్పల్‌
బోడుప్పల్‌ పెద్దకంచె ల్యాండ్‌ పూలింగ్‌ను ఎవరూ అడ్డుకోవద్దని, మమ్మల్ని ఎవరు బెదిరించలేదని, స్వచ్ఛం దంగానే ప్రభుత్వానికి భూములను అప్పగిస్తున్నామని బోడుప్పల్‌ పెద్దకంచె భూముల హక్కుదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం బోడుప్పల్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో పెద్దకంచె భూ హక్కు దారులు ల్యాండ్‌ పూలింగ్‌ను అడ్డుకుంటున్న వారి వైఖరిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు చిన్నింగల కుమార్‌ మాట్లాడుతూ కొంతమంది తమ రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం పెద్దకంచే ల్యాండ్‌ పూలింగును అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరవతో పెద్దకంచె భూములను తాము స్వచ్ఛందంగా ల్యాండ్‌ పూలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తమను మంత్రి మల్లారెడ్డి ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని తెలిపారు. మంత్రి చొరవతోనే 70 ఏళ్ల తర్వాత బోడుప్పల్‌ దళితుల కుటుంబాల కష్టాలు తీరనున్నాయని స్పష్టం చేశారు. మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలోనే మెజార్టీ భూ హక్కుదారులు మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ లను కలిసి ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించామని వెల్లడించారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కూడా కలవనున్నట్లు తెలిపారు. అయితే ల్యాండ్‌ పూలింగ్‌ కు ఆటంకం కల్గించడానికి కొంతమంది స్వార్థపరులు మాదిగల మధ్య చిచ్చుపెట్టి విభజించాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తామంతా ఏకంగా ఉన్నామని చెప్పారు. కొంతమంది భూ హక్కుదారుల పిల్లలకు రూ. 2 లక్షలు ఇస్తామంటూ ప్రలోభపెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయం చేసుకునే వారిని తాము ఏమి అనడం లేదన్నారు. కానీ ల్యాండ్‌ పూలింగ్‌కు అడ్డువస్తే ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.
43 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు…
ఇప్పటికే హెచ్‌ఎండీఏ అధికారులు పెద్దకంచె భూములను పరిశీలించి వెళ్లారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. దాదాపు 43 మంది పెద్దకంచె భూమి హక్కు దారులంతా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ల్యాండ్‌ పూలింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దకంచే భూముల హక్కుదారులు రాపోలు నారాయణ, రాపోలు శంకరయ్య, చీరాల జంగయ్య, చంటి శ్రీనివాస్‌, దానగల్ల ఎల్లం, మీసాల యాదగిరి రాపోలు రామస్వామి, మైసగల్ల మల్లేశ్‌, చిన్నింగల సంతోష్‌, మీసాల కృష్ణ, అనేకమంది రైతు కుటుంబాల సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.