కాగుతున్న ”నూనె”

Boiling "oil"– దిగుమతి సుంకం భారం 
– భారీగా పెరిగిన ధర
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
వంట నూనెలు ప్రియం అయ్యాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఆరు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. దీంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్ ఫ్లవర్ నూనెల పై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుండి 32.5 శాతానికి పెంచారు. భారత్ లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వంట నూనె ధరలకు రెక్కలు వచ్చాయి.
నూనెల ధరలు…
సన్ ఫ్లవర్ నూనె 15 కిలోల డబ్బా ఖరీదు ఆరు రోజుల క్రితం రూ.  1800,  కాగా ప్రస్తుతం దాని ధర రూ. 2050. 15 లీటర్ల డబ్బా గతంలో 1650 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1800 లకు చేరింది. పామాయిల్ 15 కిలోల డబ్బా ఖరీదు మొన్నటిదాకా రూ. 1600. ఇపుడది రూ. 1780కు ఎగబాకింది. సన్ ఫ్లవర్ కేజీ నూనె గత ఆరు రోజుల క్రితం 120 రూపాయలు ఉండగా ప్రస్తుతం 140కి, లీటర్ 110 నుండి 130కి చేరింది. అదేవిధంగా పామాయిల్ ఒక కేజీ 110 నుండి 130 రూపాయలకు, లీటరు 100 నుండి 120 కి పెరిగింది. కారణం.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో గత శుక్రవారం అర్ధరాత్రి నుంచే ధరల్లో పెరుగుదల పరుగులు తీసింది. అయితే హోల్సేల్ ధర కంటే  కిరాణా దుకాణాలలో మరో ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువగా విక్రయిస్తున్నారు.
పోపు పెట్టాలన్నా..
కూర రుచిగా ఉండాలన్నా.. అట్టు వేయాలన్నా.. గారె వేయించాలన్నా… వంట నూనె ఉండాల్సిందే. ఇది లేకుండా ఆహార పదార్ధాల తయారీని ఊహించలేం, ఇప్పుడా వంట నూనె ధరల మంటతో సలసల కాగుతోంది. ఒక్కసారిగా కిలోపై రూ. 20కి పైగానే పెరిగింది. వంటింటి బడ్జెట్ ఒక్కసా రిగా గాడి తప్పే పరిస్థితి ఏర్పడింది. ఎక్కువమంది ఉపయోగించే పామాయిల్, పొద్దు తిరుగుడు నూనె ధరలు భారీగా పెరిగాయి. విదేశీ దిగుమతులపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో గత శుక్రవారం ఆర్థ రాత్రి నుంచే పెరిగిన ధరలు అమ ల్లోకి వచ్చాయి. ఇది తెలిసి శనివారం  నుండి దుకాణాలకు వెళ్లిన వినియోగదారులకు రిక్తహస్తాలు ఎదురయ్యాయి. నిల్వల్లేవని కొంతమంది వ్యాపారులు చెప్పగా…. పాత ధరల్లో కొనుగోలు చేసిన వంట నూనెను కొత్త ధరల్లో అమ్మలేక కొందరు వ్యాపారులు నిల్వల్లేవని చెప్పడం గమనార్హం. వారం రోజుల  కిందట సొమ్ము చెల్లించుకుని  డెలివరీ ఇవ్వాల్సిన ట్యాంకర్లకు సంబంధించి మొత్తాన్ని వ్యాపార సంస్థలు వ్యాపారులకు తిరిగిచ్చేశాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా సొమ్ము చెల్లిస్తే సరఫరా చేస్తామని షరతు విధించాయి. దీంతో  రిటైల్ వ్యాపారులు  శనివారం నుంచి పెరీగిన ధరల ప్రకారమే విక్రయించారు.
నెలకు రూ. 10 కోట్ల అదనం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నెలకు సుమారు 70 లక్షల కిలోల వంట నూనెను వినియోగిస్తున్నట్టు నూనె విక్రయదారులు పేర్కొంటున్నారు. ఒక్కసారిగా కిలోపై కనిష్టంగా రూ. 20 పెరిగినందున నెలకు సుమారు రూ. 10 కోట్ల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దసరా, దీపావళి వంటి ముఖ్య పండుగలు వరుసగా ఉన్న నేపథ్యంలో నూనె వాడకం భారీగా పెరుగుతుంది. ఆ మేరకు భారం పడనుంది.
కల్తీకి రెక్కలు..
మార్కెట్లో వంట నూనె లూజు విక్రయాల పేరుతో కల్తీకి అవకాశం ఉంది. రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, మాంసాహారం విక్రయించే వారు ఎక్కువగా లూజు వంటనూనె కొనుగోలు చేస్తుంటారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న నూనె మిల్లుల నుండి నల్లగొండ చుట్టుపక్కల మండలాలు, గ్రామాలకు
 చెందినవారు లూజుగా డబ్బాల్లో కొనుగోలు చేస్తున్నారు. హోల్సేల్ వ్యాపారుల వద్ద డబ్బాలు కొనుగోలు చేసి పల్లెల్లో విక్రయించేవారూ ఉన్నారు. లూజు విక్రయాలను అడ్డం పెట్టుకుని కొంతమంది కల్తీ విక్రయించే అవకాశాలున్నాయి.
తనిఖీలు అవసరం..
నల్లగొండ జిల్లా కేంద్రంలో గతంలో ఆయిల్ మిల్లులలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు  కల్తీ నూనెను గుర్తించిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం వంట నూనె ధరలకు రెక్కలు రావడంతో కల్తీ జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కల్తీ ని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైస్ మిల్లులను తనిఖీ చేసి నూనె కల్తీని అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.