– 178 మంది మృతి
— 15 వేలు దాటిన మరణాలు : పాలస్తీనా వెల్లడి
గాజా : ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు ప్రారంభించింది. వారం రోజుల కాల్పుల విరమణ అనంతరం ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం నుంచే దాడులు ప్రారంభించింది. మళ్లీ మొదలైన ఈ దాడుల్లో 178 మంది మృతి చెందారని, దాదాపు 589 మందికి గాయపడ్డారని గాజాలోని హమాస్ నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే తాజా దాడులకు హమాస్‌నే కారణమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆరోపించింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించారు. దీంతో మళ్లీ దాడులు ప్రారంభించడం జరిగింది అని ఐడీఎఫ్ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొంది. ఇజ్రాయెల్- హమాస్ సంధి ప్రకారం.. నవంబర్ 24-30 తేదీ వరకు 80 మంది ఇజ్రాయిలీలు, 24 మంది విదేశీపౌరులను హమాస్ విడుదల చేయగా.. 240 మంది పాలస్తీనా ఖైదీదలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. అయితే గాజాలో 17 మంది మహిళలు, పిల్లలతో సహా 136 మంది బంధీలుగా ఉన్నారని ఐఎడిఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని నివాస ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తోంది. కాగా, యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటివరకు గాజాలో 15,200 మంది మృతి చెందినట్టు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. చనిపోయినవారిలో మూడింట రెండొంతులు మహిళలు, చిన్నారులేనని తెలిపింది. మరో 40 వేలమంది పౌరులు గాయపడినట్లు ప్రకటించింది. అక్టోబరు 7న హమాస్ మెరుపు దాడులకు ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే.