నెలాఖరులోగా కార్మికులకు బాండు డబ్బులు

నెలాఖరులోగా కార్మికులకు బాండు డబ్బులు– టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హామీ
– 16 అంశాలపై ఎండీకి ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీ వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఈ నెలాఖరులోగా బాండు డబ్బులు చెల్లిస్తామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చారు. బుధవారం టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ మహమూద్‌ ఆధ్వర్యంలో నాయకులు అబ్రహం కె.సురేందర్‌, వెంకటగిరి, కల్పన, జయ శ్రీ, ఎండీ హాఫీజ్‌ ఖాన్‌ తదితరులు ఎండీ సజ్జనార్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించి 16 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్‌ మహమూద్‌ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్‌ జారీ, ఇతర సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో యూనియన్‌ ఎన్నికలు నిర్వహించి ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీని గుర్తించాలని కోరారు. దీనిపై ఎండీ సజ్జనార్‌ స్పందిస్తూ.. జీరో టికెట్‌ జారీ.., కండక్టర్లపై కేసులు అవ్వకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి కార్డులు జారీ చేసే ప్రతిపాదన ఉందని, కార్మికులకు తార్నాక ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌ కేటగిరిలో ప్రమోషన్స్‌, వెల్ఫేర్‌ కమిటీల రద్దు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎండీ హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష రాసిన కండక్టర్లకు ప్రమోషన్లపై ఎండీ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు.