పాకిస్థాన్‌ బోణీ

Boni of Pakistan– నెదర్లాండ్స్‌పై 81 పరుగులతో గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీ కొట్టింది. రెండు వార్మప్‌ మ్యాచుల్లో ఓటమి పాలైన పాకిస్థాన్‌.. అసలు సమరంలోనూ ఆ భయాందోళనలు కలిగించింది. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు మెరవటంతో తొలుత మెరుగైన స్కోరు సాధించిన పాకిస్థాన్‌.. బౌలర్ల మెరుపులతో అలవోక విజయమే సాధించింది. తొలుత పాకిస్థాన్‌ 49 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలగా.. ఛేదనలో నెదర్లాండ్స్‌ 41 ఓవర్లలో 205 పరుగులకు చేతులెత్తేసింది. పాకిస్థాన్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అక్టోబర్‌ 10న హైదరాబాద్‌లోనే శ్రీలంకతో పాకిస్థాన్‌ తన రెండో మ్యాచ్‌ ఆడనుంది.
ఆదుకున్న రిజ్వాన్‌, షకీల్‌ : టాస్‌ నెగ్గిన నెదర్లాండ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే 38 పరుగులకే పాకిస్థాన్‌ టాప్‌-3 వికెట్లు పడగొట్టింది. జమాన్‌ (12), ఇమామ్‌ (15), బాబర్‌ (5)లు స్వల్ప స్కోరుకే నిష్క్రమించారు. ఈ పరిస్థితుల్లో మహ్మద్‌ రిజ్వాన్‌ (68, 75 బంతుల్లో 8 ఫోర్లు), సయీద్‌ షకీల్‌ (68, 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) ఆ జట్టును ఆదుకున్నారు. నెదర్లాండ్స్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలు సైతం పాకిస్థాన్‌కు బాగా కలిసొచ్చాయి. మిడిల్‌ ఆర్డర్‌లో రిజ్వాన్‌, షకీల్‌ అర్థ సెంచరీలతో కోలుకున్న పాకిస్థాన్‌.. లోయర్‌ ఆర్డర్‌లో మహ్మద్‌ నవాజ్‌ (39), షాదాబ్‌ ఖాన్‌ (32) మెరుపులతో మెరుగైన స్కోరు సాధించింది. హరీశ్‌ రవూఫ్‌ (16 ), షహీన్‌ (13 నాటౌట్‌) రాణించారు. డచ్‌ బౌలర్లలో లీడె (4/62) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఇక ఛేదనలో నెదర్లాండ్స్‌ ఆశించిన దూకుడు కనబరచలేదు. ఓపెనర్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ (52, 67 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), లీడె (67, 68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిసినా.. మిగతా బ్యాటర్లు రాణించలేదు. మాక్స్‌ (5), కొలిన్‌ (17), తేజ నిడమనురు (5), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (0), షకిబ్‌ (10), వాన్‌డర్‌ మెర్వ్‌ (4)లు తేలిపోయారు. చివర్లో వాన్‌ బీక్‌ (28 నాటౌట్‌, 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులతో నెదర్లాండ్స్‌ 200 పరుగుల మార్క్‌ దాటింది. పాకిస్థాన్‌ బౌలర్లలో ఇఫ్తీకార్‌ అహ్మద్‌ (3/43), హసన్‌ అలీ (2/33) డచ్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. పాకిస్థాన్‌ బ్యాటర్‌ సయీద్‌ షకిబ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.