బూమ్‌ బూమ్‌ లచ్చన్న..

బూమ్‌ బూమ్‌ లచ్చన్న..‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్‌ చిత్రాల్లో నటించిన వినోద్‌ కిషన్‌ను హీరోగా, అనూష కష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘పేక మేడలు’. ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాతో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకున్న నిర్మాత రాకేష్‌ వర్రే తాజాగా ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ విశ్వక్‌సేన్‌ చేతుల మీదుగా విడుదలై, చాలా మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ‘బూమ్‌ బూమ్‌ లచ్చన్న’ పాటను మేకర్స్‌ విడుదల చేశారు.
‘లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న..’ అంటూ సాగే ఈ పాటను మనో పాడగా, భార్గవ్‌ కార్తీక్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. స్మరణ్‌ సాయి అందించిన మ్యూజిక్‌ చాలా ఎట్రాక్టీవ్‌గా కొత్తగా ఉంది. ఈ పాట ఆద్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించినట్టుగా పాటను చూస్తే తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమాను జూలైలో విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది.